ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంటలు చేతికొచ్చే సమయంలో ప్రకృతి కన్నెర్ర చేయడంతో రైతాంగం కన్నీరుమున్నీరవుతోంది. వరి, మొక్కజొన్న, కూరగాయల పంటలు నేలవాలగా.. మార్కెట్ యార్డుల్లో ఆరబోసిన పసుపు, వరి ధాన్యం నీటిపాలైంది. జిల్లాలోని నందిపేట, బాల్కొండ, భీమ్గల్, జుక్కల్, మద్నూర్ మండలాల్లో కోతకు సిద్ధంగా ఉన్న వరి పంట ఈదురుగాలుల ధాటికి కుప్పకూలిపోయింది.
భారీ వర్షంతో వరి వెన్నులు నేలవాలి నీటిలో నానుతున్నాయి. అటు మొక్కజొన్న పంట పరిస్థితి మరింత దారుణంగా మారింది. గాలివేగానికి మొక్కజొన్న చెట్లు విరిగిపడటంతో దిగుబడిపై ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని రైతులు వాపోతున్నారు.
నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో విక్రయానికి తెచ్చిన పసుపు కుప్పలు అకాల వర్షానికి తడిసి ముద్దయ్యాయి. వందలాది క్వింటాళ్ల పసుపు క్రయవిక్రయాలకు సిద్ధంగా ఉన్న తరుణంలో కురిసిన వానతో నాణ్యత దెబ్బతినే ప్రమాదం ఉంది.
జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఇంకా పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయకపోవడంతో రైతులు రోడ్లపై, కళ్లాల్లో ధాన్యాన్ని ఆరబోశారు. నిజాంసాగర్ ఆయకట్టు పరిధిలో కోతలు ముగిసిన ధాన్యం రాశులు నీటిలో కొట్టుకుపోయాయి.
అలగే కామారెడ్డి పట్టణంతో పాటు బిక్కనూర్, దొమకొండ, రాజంపేట, తాడ్వాయి, బిబీపేట్, మాచారెడ్డి, సదాశివనగర్ మండలాల్లో వాన బీభత్సం సృష్టించింది. ఎకరాకు వేల రూపాయలు పెట్టుబడి పెట్టి పంటను కాపాడుకుంటే, చివరి నిమిషంలో ప్రకృతి ప్రకోపంతో చేతికి రావాల్సిన గ్రాసం నోటికాడ ముద్ద కాకుండా పోయిందని రైతులు ఆవేదన చెందుతున్నారు.
పెట్టుబడులు కూడా వచ్చేలా లేవని, అప్పుల ఊబిలో కూరుకుపోతున్నామని వాపోతున్న రైతులు.. ప్రభుత్వం వెంటనే స్పందించి క్షేత్రస్థాయిలో నష్టాన్ని అంచనా వేయాలని డిమాండ్ చేస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని నిబంధనలతో సంబంధం లేకుండా కొనుగోలు చేసి, తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
