జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని, ప్రజలు ఎలాంటి వదంతులను నమ్మవద్దని నిజామాబాద్ పోలీస్ కమీషనర్ సాయి చైతన్య స్పష్టం చేశారు. బుధవారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
గత కొద్ది గంటలుగా సామాజిక మాధ్యమాల్లో ఇంధన కొరతపై జరుగుతున్న అసత్య ప్రచారాల వల్ల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు.
దీనివల్ల ప్రజలు ఒక్కసారిగా పెట్రోల్ బంకులకు చేరుకుని వాహనాల్లో ఫుల్ ట్యాంకులు నింపించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని, ఫలితంగా బంకుల వద్ద అనవసర రద్దీ ఏర్పడి ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోందని తెలిపారు. జిల్లాలోని అన్ని పెట్రోల్ బంకుల్లో సరిపడా ఇంధన నిల్వలు అందుబాటులో ఉన్నాయని, సరఫరా కూడా నిరంతరాయంగా కొనసాగుతోందని కమీషనర్ వివరించారు.
ప్రజలు తమ అవసరానికి మించి ఇంధనాన్ని నిల్వ చేసుకోవద్దని, అలా చేయడం వల్ల ఇతరులకు అసౌకర్యం కలుగుతుందని సూచించారు.
అసత్య ప్రచారాలపై నిఘా
నిర్ధారించని సమాచారాన్ని షేర్ చేస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టించవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. వదంతులు వ్యాప్తి చేసే వారిపై, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే వారిపై పోలీసు నిఘా ఉందని, అటువంటి వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉన్నారని పునరుద్ఘాటించారు.
