ప్రస్తుత కాలంలో పెరుగుతున్న వాహన రద్దీ దృష్ట్యా ప్రతి ఒక్కరూ రహదారి భద్రత పట్ల అవగాహన కలిగి ఉండాలని ఆర్టీవో ఉమామహేశ్వర్ పిలుపునిచ్చారు.విద్యార్థులు ట్రాఫిక్ నిబంధనలను నేర్చుకుని తమ తల్లిదండ్రులకు, చుట్టుపక్కల వారికి అవగాహన కల్పించాలని కోరారు. శుక్రవారం నగరంలోని ఐటీఐ కళాశాల, నలంద ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు రహదారి భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రహదారి నిబంధనల పట్ల నిర్లక్ష్యం వహించడం వల్లే అధిక శాతం ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వాహనం నడిపే సమయంలో హెల్మెట్, సీటు బెల్టు తప్పనిసరిగా ధరించాలని, సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపరాదని సూచించారు.
మైనర్లకు వాహనాలు ఇవ్వడం చట్టరీత్యా నేరమని, దీనివల్ల అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని గుర్తుచేశారు.ఏఎంవీఐ వాసుకి ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళీకృష్ణ మాట్లాడుతూ, విద్యార్థి దశ నుంచే ఇలాంటి అంశాలపై అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాలకు చెందిన సుమారు 450 మంది విద్యార్థులు, ఉపాధ్యాయ బృందం ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థులు అడిగిన పలు సందేహాలను అధికారులు నివృత్తి చేశారు. అనంతరం రహదారి భద్రతా నియమాలను పాటిస్తామని విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమానికి ఎంవీఐ కిరణ్ కుమార్, అసిస్టెంట్ మోటార్ వాహన తనిఖీ అధికారులు పవన్ కళ్యాణ్, వాసుకి,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
