నిజామాబాద్, జనవరి 24 : ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా పూర్తి స్థాయిలో లబ్ది చేకూరేలా సంబంధిత శాఖల అధికారులు చొరవ చూపాలని జిల్లా జడ్జి జీ.వీ.ఎన్.భరతలక్ష్మి సూచించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చొరవతో డీఆర్డీఏ, సెర్ప్, విద్యా శాఖల సంయుక్త ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా జనరల్ ఆసుపత్రిలో శనివారం ప్రత్యేక అవసరాల బాలబాలికల కోసం సదరం శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
ఈ శిబిరాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి జిల్లా జడ్జి లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ, దివ్యాంగులైన తమ పిల్లలకు సదరం సర్టిఫికెట్లు, ఆసరా పెన్షన్లను ఇప్పించాలని పలువురు తనను కలిసి కోరడం జరిగిందన్నారు. దీంతో సంబంధిత అధికారులను సంప్రదించి, జిల్లా కలెక్టర్ తోడ్పాటుతో ఈ ప్రత్యేక సదరం శిబిరాన్ని ఏర్పాటు చేయించామని తెలిపారు.
దివ్యాంగులైన పిల్లలు వారికి ఏం కావాలి అన్నది అడగలేని పరిస్థితిలో ఉంటారని, వారి అవసరాలను సంబంధిత అధికారులే గుర్తించి సహకారం అందించాలని సూచించారు. ప్రత్యేక అవసరాలు కలిగిన వారి కోసం ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా వారు పూర్తి స్థాయిలో లబ్ది పొందేలా చొర చూపాల్సిన గురుతర బాధ్యత అధికారులదేనని స్పష్టం చేశారు.
భవిత కేంద్రాలలో కనీస సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. దివ్యాంగులకు ప్రతి వారం సదరం శిబిరం నిర్వహిస్తూ సర్టిఫికెట్లు జారీ చేస్తారని, అర్హులైన వారికి పెన్షన్ అందిస్తారని, ఈ విషయాన్ని తోటి వారికి తెలియజేయాలని దివ్యాంగుల తల్లిదండ్రులకు సూచించారు. ప్రభుత్వ పథకాలు వర్తింపజేయకపోతే, సరైన విధంగా సేవలు అందించకపోతే జిల్లా అధికారులకు తెలుపాలని, సరైన స్పందన రాకపోతే జిల్లా న్యాయసేవా సంస్థను సంప్రదించవచ్చని సూచించారు.
కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, ఈ శిబిరాలలో సదరం సర్టిఫికెట్లు ఇప్పించిన అనంతరం, అర్హులైన వారికి త్వరితగతిన ఆసరా పెన్షన్లు మంజూరయ్యేలా జిల్లా యంత్రాంగం తరపున చొరవ చూపుతామని అన్నారు. ఈ మేరకు అవసరమైన ధ్రువపత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని దివ్యాంగులైన పిల్లల తల్లిదండ్రులకు సూచించారు.
ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల కోసం ప్రభుత్వం తగిన సదుపాయాలతో ఏర్పాటు చేసిన భవిత కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కేంద్రాలలో సాధారణ పిల్లలతో ప్రత్యేక అవసరాలు కలిగిన బాలలు మమేకమై వైకల్యం బారి నుండి క్రమక్రమంగా కోలుకునేందుకు అవకాశం ఉంటుందని అన్నారు.
భవిత కేంద్రాలలో పిల్లలకు పూర్తి స్థాయిలో సదుపాయాలు అందుబాటులో ఉంచుతూ, వారికి అవసరమైన స్పీచ్ థెరపి, ఫిజియోథెరపి వంటివి అందించాలని రిసోర్స్ పర్సన్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ సాయాగౌడ్, జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, జిల్లా జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్, ప్రభుత్వ వైద్య కళాశాల ఇంచార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ జలగం తిరుపతి రావు తదితరులు పాల్గొన్నారు.
