HomeTelanganaNizamabadనిజామాబాద్ అభివృద్ధే ధ్యేయం.. కాంగ్రెస్‌ హయాంలోనే ప్రగతి..టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌ గౌడ్‌

నిజామాబాద్ అభివృద్ధే ధ్యేయం.. కాంగ్రెస్‌ హయాంలోనే ప్రగతి..టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌ గౌడ్‌

జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలన్న తపనతో ముందుకు సాగుతున్నామని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ అన్నారు. నిజామాబాద్‌లో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నిజామాబాద్‌ జిల్లా అభివృద్ధిలో కాంగ్రెస్‌ ప్రభుత్వాల పాత్ర కీలకమని పేర్కొన్నారు.

వైఎస్‌ఆర్‌ హయాంలో తెలంగాణ యూనివర్సిటీ వచ్చిందని, కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో మెడికల్‌ కాలేజీ సాధించుకున్నామని గుర్తు చేశారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం కొత్తగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంజినీరింగ్‌, వ్యవసాయ కళాశాలలను తీసుకొచ్చామని, వాటిలో తరగతులు సైతం ప్రారంభమయ్యాయని చెప్పారు. అలాగే లింబాద్రిగుట్టపై గెస్ట్‌హౌస్‌ నిర్మాణం చేపడుతున్నామని, రాష్ట్రంలో అత్యధికంగా ఇందిరమ్మ ఇళ్లు నిజామాబాద్‌ జిల్లాలో మంజూరు చేశామని వెల్లడించారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి, సంక్షేమాన్ని సమాంతరంగా ముందుకు తీసుకెళ్తున్నామని అన్నారు. హైదరాబాద్‌ తరహాలో నిజామాబాద్‌లో పైలట్‌ ప్రాజెక్టుగా ఇందిరమ్మ టవర్స్‌ నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

ఓ వైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధితో పాటు కాంగ్రెస్‌ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై దృష్టి సారించామని మహేశ్‌కుమార్‌ గౌడ్‌ చెప్పారు. సహకార సంఘాల్లో పార్టీ కోసం కష్టపడ్డ వారికి పదవులు కల్పిస్తామని అన్నారు.

నిజామాబాద్‌ మాస్టర్‌ప్లాన్‌పై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో చర్చించినట్లు వెల్లడించారు. నిజామాబాద్‌ను స్మార్ట్‌సిటీగా తీర్చిదిద్దలేని వారు ఇప్పుడు అభివృద్ధిపై మాట్లాడటం విడ్డూరంగా ఉందని బీజేపీ నేతలపై విమర్శించారు.

అలాగే కొందరు సంస్కారహీనంగా మాట్లాడటం సరికాదని హితవు పలికారు. విమర్శలకు సమాధానం అభివృద్ధి రూపంలో చూపిస్తామని సవాల్ చేశారు.ఆర్మూర్‌లో త్వరలో పామాయిల్‌ పరిశ్రమ రాబోతోందని తెలిపారు.

వ్యవసాయ రంగంలో నిజామాబాద్‌ జిల్లా రాష్ట్రంలోనే మేటి జిల్లాగా నిలిచేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జిల్లా అభివృద్ధినే ప్రధాన ధ్యేయంగా పెట్టుకుని ప్రభుత్వం, పార్టీ కలిసి ముందుకు సాగుతున్నాయని స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు రామకృష్ణ, నగేశ్‌రెడ్డి, కార్పొరేషన్‌ చైర్మన్‌ తాహెర్‌బిన్‌, యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు విపుల్‌ పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments