ఎన్నికల పరిశీలకులతో కలిసి అధికారులతో సమీక్ష
నిజామాబాద్, జనవరి 31 : మున్సిపల్ ఎన్నికల నోడల్ అధికారులు వారికి కేటాయించిన విధులను సమర్ధవంతంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) అంకిత్ సూచించారు.
ఎన్నికల సాధారణ పరిశీలకులు సీహెచ్.సత్యనారాయణరెడ్డి, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిరణ్ కుమార్ లతో కలిసి శనివారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో మున్సిపల్ ఎన్నికల నోడల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు తీసుకున్న చర్యల గురించి అడిగి తెలుసుకుని, పోలింగ్, కౌంటింగ్ కోసం చేపట్టాల్సిన ఏర్పాట్లపై సూచనలు చేశారు.
ఎన్నికల విధులు ఎంతో కీలకమైనందున ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా, పారదర్శకంగా, సాఫీగా ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేలా కృషి చేయాలన్నారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామాగ్రి అంతా సిద్ధంగా ఉండాలన్నారు.
ఈ నెల 13న పోలింగ్ జరగనున్న దృష్ట్యా ఎన్నికల సిబ్బంది, సూక్ష్మ పరిశీలకుల ర్యాండమైజేషన్, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. బ్యాలెట్ పేపర్ల ముద్రణ, మెటీరియల్ మేనేజ్మెంట్, ఎన్నికల సిబ్బంది, జోనల్ అధికారుల నియామకం గురించి చర్చించారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా ఎస్.ఎస్.టీ, ఎఫ్.ఎస్.టీ బృందాలతో గట్టి నిఘా ఉంచాలన్నారు.
సరిహద్దు ప్రాంతాలలో తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేసి క్షుణ్ణంగా తనిఖీలు జరిపించాలన్నారు. పోలింగ్ కేంద్రాలలో తగిన సౌకర్యాలు అందుబాటులో ఉండేలా పరిశీలన చేసుకోవాలని అన్నారు. ఎన్నికల నిర్వహణ ప్రక్రియలకు సంబంధించిన వివిధ రిపోర్టులను తప్పులు లేకుండా ఎప్పటికప్పుడు టీ.పోల్ యాప్ లో అప్లోడ్ చేయాలన్నారు.
సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేపడుతూ, వెబ్ క్యాస్టింగ్ జరిపించాలన్నారు. డిస్ట్రిబ్యూషన్, రిసీవింగ్ సెంటర్ల వద్ద తగిన భద్రత, సదుపాయాలు అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
చివరి సమయంలో హడావుడి పడకుండా ముందస్తుగానే ఏర్పాట్లను చక్కబెట్టుకోవాలని హితవు పలికారు. ప్రతి ఒక్కరు ఎన్నికల నియమావళిని తు.చ తప్పక పాటించేలా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలన్నారు.
ఎక్కడా అలసత్వానికి తావివ్వవద్దని, ఎన్నికల విధుల పట్ల ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలకు గురి కావాల్సి వస్తుందన్నారు.
నోడల్ అధికారులు మరోసారి ఎన్నికల నియమ, నిబంధనలను క్షుణ్ణంగా సరిచూసుకొని పొరపాట్లు దొర్లకుండా విధులు నిర్వహించాలని సూచించారు. సమీక్షా సమావేశంలో డీఆర్డీఓ సాయాగౌడ్, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, వివిధ విభాగాల నోడల్ అధికారులు పాల్గొన్నారు.
