చావు నోట్లో తలపెట్టి తెలంగాణ రాష్ట్రం సాధించిన ఉద్యమ యోధుడు కేసీఆర్ కు ఇన్ని వేధింపులా? అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి మండిపడ్డారు.
రాజకీయంగా కేసీఆర్ ను ఎదుర్కొనే దమ్ము లేకనే ఎలాంటి లోపాలు లేని కాళేశ్వరం ప్రాజెక్టు పై విషం కక్కుతూ ఆయనకు నోటీసులు జారీ చేయడం కాంగ్రెస్ కుట్రలో భాగమేనని ఆయన మంగళ వారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు.
కేసీఆర్ ను విచారణకు పిలవడాన్ని తెలంగాణ ప్రజలు బ్లాక్ డేగా పరిగణిస్తున్నారని జీవన్ రెడ్డి తెలిపారు. ఉద్యమ నేత, అభివృద్ధి, సంక్షేమ ప్రధాత కేసీఆర్ తో పెట్టుకున్నోళ్ళు ఎవరైనా మట్టి కొట్టుకుపోతరని ఆయన హెచ్చరించారు.
గద్దెనెక్కిన తొలిరోజు నుంచే కక్ష సాధిపుల పర్వానికి తెరలేపిన సీఎం రేవంత్ రెడ్డికి ప్రజాకోర్టులో శిక్ష తప్పదన్నారు. తనవి బీజేపీ, టీడీపీ మూలాలని రేవంతే స్వయంగా చెప్పుకున్నారని ఆయన గుర్తు చేశారు.
రేవంత్ చదివిన మోడీ, చంద్రబాబు స్కూళ్లకు ఛీటింగ్ తప్ప రేటింగ్ లేదని ఎద్దేవా చేశారు. అవి కుసంస్కార స్కూళ్ళు కాబట్టే రేవంత్ రెడ్డి చెడి పోయిండన్నారు.
అందుకేఆయన ఫిరాయింపులు, పేమెంట్ కోటాలో రాహుల్ గాంధీ వద్ద ముఖ్యమంత్రి ఉద్యోగం సంపాదించుకొని తెలంగాణ ను దోపిడీ చేస్తూ డిల్లీకి డబ్బు మూటలు మోస్తున్నారని జీవన్ రెడ్డి ఆరోపించారు.
ఈడీ కేసులో రేవంత్ కు మోడీ రక్షణ అని, కాళేశ్వరాన్ని విఫల ప్రాజెక్టును చేసి బాబుకు గురుదక్షిణగా ఇస్తున్నారని, కాంగ్రెస్ అధిష్టానానికి తన అసలు రంగు తెలియడంతోపదవి కాపాడుకునేందుకు రాహుల్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.
తెలంగాణ ఇచ్చి తీరాలని తొడగొట్టిన మొనగాడు కేసీఆర్ అని,ఆయన పేర్కొంటూ కేసీఆర్ అనే మేరు పర్వతాన్నే ఢీకొట్టే దమ్ముందా?అని మండిపడ్డారు.
హామీలను అమలు చేయలేక చేతులెత్తేసిన కాంగ్రెస్ ప్రభుత్వం సాగిస్తున్న డైవర్షన్ పోలిటిక్స్ తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవాన్ని దెబ్బ తీస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
రేవంత్ కుటిలత్వంపై తెలంగాణ ప్రజల్లో ఆగ్రహ జ్వాలాలు వ్యక్తమవుతున్నా యని ఆయన చెప్పారు.కేసులకు, విచారణలకు భయపడమని ,హామీల అమలుకు చివరి వరకు ప్రజల పక్షాన పోరాడుతామని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు.
