నందిపేట్ ఐలాపూర్ సొసైటీ ఆర్థిక లావాదేవీల్లో అక్రమాలు జరిగాయని వచ్చిన ఆరోపణలపై అసలు లెక్కేంటో తేల్చేందుకు అధికారుల విచారణ మొదలైంది. సొసైటీ ఆర్థిక లావాదేవీల్లో పెద్ద మొత్తంలో అవకతవకలు జరిగాయంటూ ప్రజావాణిలో ఫిర్యాదు రావడంతో జిల్లా సహకార అధికారి (డీసీవో) ప్రత్యేక దృష్టి సారించారు.
దీంతో గత ఐదేళ్లుగా జరిగిన ఆడిట్లతోపాటు సొసైటీకి సంబంధించిన రిజిస్టర్లు, ఆర్థిక లావాదేవీలను పరిశీలించేందుకు అసిస్టెంట్ రిజిస్ట్రార్ స్వప్న రంగంలోకి దిగారు. ధాన్యం కొనుగోళ్లు, హమాలీ చార్జీలు, రవాణా ఖర్చులు, ఎరువుల కొనుగోలు–విక్రయాలు, నిర్వహణ వ్యయాల పేరుతో జరిగిన లావాదేవీల్లో అవకతవకలు చోటుచేసుకున్నాయన్న ఫిర్యాదులపై చేపట్టారు.
కేవలం ఫిర్యాదులోని అంశాలకే పరిమితం కాకుండా సొసైటీ రికార్డుల్లో నమోదైన లావాదేవీలను సీజన్లు, గ్రామాల వారీగా పరిశీలిస్తున్నారు.గత నాలుగైదు రోజులుగా విచారణ కొనసాగుతోంది. ప్రతి ఏడాది నిర్వహించిన ఆడిట్లలోని వివరాలతో సొసైటీ రికార్డులను అధికారులు సరిపోల్చుతున్నారు.
ధాన్యం కొనుగోళ్లు, రైతులకు చెల్లింపులు, హమాలీ, రవాణా, ఎరువుల లావాదేవీలు, నిర్వహణ ఖర్చులకు సంబంధించిన లెక్కలను పరిశీలిస్తున్నారు. కాగితాలపై ఉన్న లెక్కలకు.. వాస్తవ లావాదేవీలకు మధ్య తేడాలేమైనా ఉన్నాయా? అన్నదే ఇప్పుడు కీలకంగా మారింది.ఒక్కో బిల్లు, వౌచర్, రసీదు, చెక్కు, బ్యాంకు స్టేట్మెంట్ను పరిశీలిస్తూ.. కాగితాలపై చూపించిన ఖర్చు వాస్తవంగా జరిగిందా? లేదా? అన్నది నిర్ధారించే పనిలో అధికారులు ఉన్నారు.
ఎరువుల కొనుగోలు–విక్రయాలకు సంబంధించిన లెక్కలు, ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన చెల్లింపులు, హమాలీ–రవాణా వ్యయాల మధ్య పొంతన ఉందా? అన్నదీ పరిశీలిస్తున్నారు.డీసీవో ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన అసిస్టెంట్ రిజిస్ట్రార్ స్వప్న పరిశీలనను ముమ్మరం చేశారు.
మరో రెండు రోజుల్లో విచారణ పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అనంతరం సమగ్ర నివేదికను డీసీవోకు సమర్పించనున్నారు.విచారణాధికారి సమర్పించే నివేదిక ఆధారంగా తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
