HomeCRIMEఅక్రమ నిర్మాణంపై అధికారుల మౌనం! కమిషనర్‌ నోటీసులు.. కోర్టు ఆదేశాలూ బేఖాతర్‌? 2019లోనే ముగిసిన అనుమతి...

అక్రమ నిర్మాణంపై అధికారుల మౌనం! కమిషనర్‌ నోటీసులు.. కోర్టు ఆదేశాలూ బేఖాతర్‌? 2019లోనే ముగిసిన అనుమతి గడువు.. అయినా నిర్మాణం జీరో సెట్‌బ్యాక్‌తో భవనం.. ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోందని కమిషనర్‌ ఆందోళన

నగర నడిబొడ్డున.. నిత్యం వేలాది మంది రాకపోకలు సాగించే బస్టాండ్‌ సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఓ భవన నిర్మాణంపై మున్సిపల్‌ టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు మౌనం వహిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిర్మాణం అక్రమమని గుర్తించి స్వయంగా మున్సిపల్‌ కమిషనర్‌ షోకాజ్‌ నోటీసులు జారీ చేయడంతోపాటు, 15 రోజుల్లో కూల్చివేత చేపట్టాలని ఆదేశించినట్లు సమాచారం.

ఈ వ్యవహారంలో న్యాయస్థానం ఆదేశాలు సైతం ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో నిర్మాణంపై చర్యలు కనిపించడం లేదన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోందని కమిషనరే నోటీసుల్లో ప్రస్తావించినా.. సంబంధిత విభాగం ఎందుకు స్పందించడం లేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

సంబంధిత భవనానికి 2016లో సెల్లార్‌, స్టిల్ట్‌ ఫ్లోర్‌తో పాటు నాలుగు పై అంతస్తుల నిర్మాణానికి అనుమతి పొందినట్లు సమాచారం. అప్పట్లో ప్రధాన రహదారి వెడల్పు 80 అడుగులుగా ఉండగా.. ఆ మేరకు నిబంధనల ప్రకారం సెట్‌బ్యాక్‌లు వదలాల్సి ఉంది. అయితే నిర్ణీత గడువులో నిర్మాణం చేపట్టకపోవడంతో 2019లో అనుమతి కాలం ముగిసినట్లు తెలిసింది.

అయినప్పటికీ 2024లో తిరిగి నిర్మాణ పనులు ప్రారంభమైనట్లు సమాచారం. గడువు ముగిసిన పాత అనుమతితోనే పనులు కొనసాగిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ ప్రాంతంలోని రహదారి వెడల్పు 120 అడుగులకు చేరినట్లు సమాచారం.

ఇలాంటి పరిస్థితుల్లో వర్తించే నిబంధనల ప్రకారం రహదారి విస్తరణకు సంబంధించి అవసరమైన భూమి, చెల్లింపులు, భవనం చుట్టూ సెట్‌బ్యాక్‌ల అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. సంబంధిత నిర్మాణంలో మాత్రం ఎలాంటి ఖాళీ స్థలం వదలకుండా జీరో సెట్‌బ్యాక్‌తో పనులు చేపట్టారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

రహదారి విస్తరణకు సంబంధించిన నిబంధనలు, భవన నిర్మాణ అనుమతులపై అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ఈ నిర్మాణంపై 2024లో ఫిర్యాదు అందడంతో అధికారులు పంచనామా నిర్వహించినట్లు తెలిసింది. అనుమతి గడువు ముగియడం, అవసరమైన సెట్‌బ్యాక్‌లు లేకపోవడం, నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం సాగుతున్న అంశాలు అందులో నమోదు చేసినట్లు సమాచారం.

అనంతరం 2026 ఫిబ్రవరిలో మున్సిపల్‌ కమిషనర్‌ షోకాజ్‌ నోటీసులు జారీ చేసి, అక్రమ నిర్మాణాన్ని 15 రోజుల్లో కూల్చివేయాలని ఆదేశించినట్లు తెలిసింది. నిబంధనల ఉల్లంఘనతో ప్రభుత్వ ఆదాయానికి నష్టం వాటిల్లే అంశాన్ని కూడా నోటీసుల్లో ప్రస్తావించినట్లు సమాచారం.

*ఓసీ దరఖాస్తు.. ఆపై తిరస్కరణ!*

ఈ వ్యవహారంలో మరో ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. సంబంధిత టౌన్‌ ప్లానింగ్‌ అధికారి చొరవతో భవన యజమానులు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ (ఓసీ) కోసం దరఖాస్తు చేసుకున్నట్లు, అనంతరం ఆ దరఖాస్తును తిరస్కరించినట్లు సమాచారం. నిబంధనలకు విరుద్ధంగా ఉందని గుర్తించిన నిర్మాణంపై తదుపరి చర్యలు తీసుకోవాల్సి ఉండగా.. కూల్చివేత విషయంలో మాత్రం పురోగతి కనిపించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాలపై అధికారులు వివరణ ఇవ్వాల్సి ఉంది.

*ఆదేశాలున్నా చర్యలేవీ?*

ఒకవైపు కమిషనర్‌ షోకాజ్‌ నోటీసులు.. మరోవైపు న్యాయస్థానం ఆదేశాలు.. అయినా నిర్మాణంపై చర్యలు ఎందుకు ముందుకు సాగడం లేదన్నది ప్రశ్నార్థకంగా మారింది. రద్దీగా ఉండే బస్టాండ్‌ ప్రాంతంలో రహదారికి ఆనుకుని నిర్మాణం సాగుతున్నా టౌన్‌ ప్లానింగ్‌ విభాగం స్పందించకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అక్రమ నిర్మాణాన్ని గుర్తించడం దగ్గరే అధికారులు ఆగిపోయారా? ఆదేశాలను అమలు చేయాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వ ఆదాయానికి నష్టం వాటిల్లుతోందని కమిషనర్‌ పేర్కొన్న నేపథ్యంలో బాధ్యులపై చర్యలు ఉంటాయా? అన్న ప్రశ్నలు స్థానికంగా చర్చనీయాంశమవుతున్నాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments