HomeCRIMEఉసురు తీస్తున్న ఆన్‌లైన్ బెట్టింగ్..ఒక్క క్లిక్‌తో అప్పుల ఊబి.. చివరికి ప్రాణాలే బలి

ఉసురు తీస్తున్న ఆన్‌లైన్ బెట్టింగ్..ఒక్క క్లిక్‌తో అప్పుల ఊబి.. చివరికి ప్రాణాలే బలి

  • పోలీసుల ఉక్కుపాదానికీ చిక్కని ఆన్‌లైన్ బెట్టింగ్..!
  • స్మార్ట్‌ఫోన్‌లో కోరలు చాస్తున్న డిజిటల్ జూదం..!

ఒకప్పుడు జూదం అంటే రహస్యంగా జరిగే వ్యవహారం. ఇప్పుడు అదే జూదం స్మార్ట్‌ఫోన్ రూపంలో ప్రతి ఇంటి గడప దాటింది. ఈసారి గెలిస్తే లక్షలు.. కోట్లు.. అంటూ ఆశలు రేపుతున్న ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లు వేలాది మంది జీవితాలను చీకటిలోకి నెట్టేస్తున్నాయి.

మొదట సరదాగా ప్రారంభమైన బెట్టింగ్.. ఆ తర్వాత వ్యసనంగా మారి, చివరకు అప్పుల భారంతో ప్రాణాలు బలిగొంటున్న విషాదాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గతంలో విదేశాల్లో, నగరాల్లో అందుబాటులో ఉన్న ఈ ఆన్‌లైన్‌ జూదం ఆటలు స్మార్ట్‌ఫోన్‌, ఇంటర్‌నెట్‌ సౌకర్యాలతో మారుమూల పల్లెలకు చేరాయి.

పైకి కనిపించకుండా జాపకింద నీరులా ఆన్‌లైన్‌ జూదంలో వేలకు వేలు మాయమవుతుడడంతో పలువురు యువకులు లక్షల్లో అప్పులపాలవుతున్నారు. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లో డబ్బులు కోల్పోయి అప్పుల పాలైన వారు ఎటూ పాలుపోక ఆత్మహత్య చేసుకుంటూ కుటుంబ సభ్యులకు తీరని శోకం మిగులుస్తున్నారు.

తాజాగా నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలో జరిగిన ఘటన మరోసారి ఈ ముప్పును కళ్లకు కట్టింది. ఆన్‌లైన్ బెట్టింగ్‌కు బానిసైన ఓ వ్యక్తి సుమారు రూ.50 లక్షల అప్పులు చేసి, ఆ అప్పులు తీర్చే మార్గం కనిపించక చివరకు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

ఒక కుటుంబానికి పెద్దదిక్కు కోల్పోయింది. భార్య, పిల్లలు, తల్లిదండ్రులకు తీరని వేదన మిగిలింది. ఈ ఒక్క ఘటన కాదు.. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి విషాదాలు వరుసగా చోటుచేసుకుంటున్నాయి.స్థానికంగా బెట్టింగ్ కేంద్రాలు నిర్వహిస్తున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.

దాడులు చేసి కేసులు నమోదు చేస్తూ అక్రమ గ్యాంబ్లింగ్‌ను అణిచివేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అయితే అదే బెట్టింగ్ ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ రూపంలో ప్రతి ఇంట్లోకి చొరబడింది. ఒకప్పుడు గల్లీల్లో, ఖాళీ స్థలాల్లో జరిగే జూదం… ఇప్పుడు అరచేతిలోని మొబైల్‌లో 24 గంటలూ అందుబాటులోకి వచ్చింది.

ఒక యాప్‌ను నిలిపివేస్తే మరో పేరుతో కొత్త యాప్ ప్రత్యక్షమవుతోంది. టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడియా లింకుల ద్వారా యువతను ఉచ్చులోకి లాగుతున్న నిర్వాహకులు పోలీసుల కంటే ఒక అడుగు ముందే ఉంటున్నారు. దీంతో స్థానిక స్థాయిలో పోలీసుల చర్యలు ఫలిస్తున్నప్పటికీ, డిజిటల్ రూపంలో విస్తరిస్తున్న ఆన్‌లైన్ బెట్టింగ్‌ను పూర్తిగా అడ్డుకోవడం పోలీసులకు పెద్ద సవాలుగా మారింది. ఆన్‌లైన్ బెట్టింగ్ ఇప్పుడు వ్యక్తిగత వ్యసనం మాత్రమే కాదు.. సామాజిక విపత్తుగా మారుతోంది.

ఒకప్పుడు గల్లీల్లో కనిపించిన జూదాన్ని పోలీసులు అణిచివేసినా.. అదే జూదం ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ రూపంలో ప్రతి ఇంట్లోకి చొరబడుతోంది. యాప్‌లు మారుతున్నా, పేర్లు మారుతున్నా.. ఉచ్చు మాత్రం అలాగే కొనసాగుతోంది. ఈ డిజిటల్ జూదానికి కేవలం పోలీసు చర్యలే సరిపోవు. ప్రభుత్వాలు, సైబర్ విభాగం, బ్యాంకింగ్ సంస్థలు, సోషల్ మీడియా వేదికలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉంది.

అదే సమయంలో యువతలో అవగాహన పెంచి, కుటుంబాలు అప్రమత్తంగా ఉంటేనే ఈ మృత్యు ఉచ్చుకు అడ్డుకట్ట వేయడం సాధ్యమవుతుంది. లేకపోతే లక్షలు గెలుస్తాం అనే ఆశతో ప్రారంభమైన ఒక్క క్లిక్… చివరకు ఒక కుటుంబ జీవితాన్నే చీకటిలోకి నెట్టే విషాదంగా మిగిలిపోతూనే ఉంటుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments