తొమ్మిది నెలలు మోసిన పసికందును ఒడిలోకి తీసుకుని ముద్దాడాల్సిన వేళ… అదే నవజాత శిశువు మృతదేహం ప్రభుత్వ ఆసుపత్రి డ్రైనేజీలో కనిపించడం ప్రతి ఒక్కరినీ కలచివేసింది. నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి క్యాజువాలిటీ విభాగం ముందున్న డ్రైనేజీలో అప్పుడే పుట్టిన గుర్తుతెలియని మగ శిశువు మృతదేహం కనిపించడంతో హృదయవిదారక పరిస్థితి నెలకొంది.
సమాచారం అందుకున్న వన్‌టౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు. శిశువును ఎవరు, ఏ పరిస్థితుల్లో అక్కడ పడేశారు. ప్రసవం ఆసుపత్రిలోనే జరిగిందా? లేక బయట నుంచి తీసుకొచ్చి వదిలేశారా? అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది.
ఆసుపత్రి పరిసరాల్లోని సీసీ కెమెరా దృశ్యాలను కూడా పరిశీలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఎవరికైనా సమాచారం తెలిసి ఉంటే నిజామాబాద్ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌ను 8712659714 నంబర్‌లో సంప్రదించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
