నిజామాబాద్ ప్రెస్ క్లబ్ కార్యవర్గానికి మంగళవారం నిర్వహించిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా పంచరెడ్డి శ్రీకాంత్ ఘనవిజయం సాధించారు. నగరంలోని ప్రెస్ క్లబ్ భవనంలో మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ ఎన్నికల ప్రక్రియలో సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
మొత్తం 260 మంది సభ్యులున్న క్లబ్లో 245 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వివిధ పదవుల కోసం భారీగా అభ్యర్థులు పోటీ పడటంతో ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగింది.
అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టారు. అర్థరాత్రి 11:30 గంటల సమయంలో ఎన్నికల అధికారులు తుది ఫలితాలను ప్రకటించారు.
విజేతలు వీరే..
అధ్యక్షుడు: పంచరెడ్డి శ్రీకాంత్
ప్రధాన కార్యదర్శి: డాక్టర్ వాగ్మారే సుభాష్
కోశాధికారి: రాజ్‌కుమార్
ఉపాధ్యక్షులు: జైన సంగీత, సతీష్ గౌడ్, గోవింద్రాజ్
ఆర్గనైజింగ్ సెక్రెటరీ: రాజు
సంయుక్త కార్యదర్శులు: రవినాయక్, సురేష్, అంజనేయులు ఎన్నికయ్యారు.
ఎన్నికైన ప్రతినిధులను పలువురు సీనియర్ విలేకరులు, తోటి జర్నలిస్టులు అభినందించారు. ప్రెస్ క్లబ్ అభివృద్ధికి, జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉంటామని ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు పేర్కొన్నారు.
