అనాథ మృతదేహాలకు గౌరవప్రదంగా అంతిమ సంస్కారాలు నిర్వహించడం అశ్వమేధ యాగంతో సమానమైన మహోన్నత సేవ అని ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు అన్నారు.
దిక్కులేని మృతులకు చివరి గౌరవాన్ని అందిస్తూ మానవత్వాన్ని నిలబెడుతున్న ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ సేవలను ఆయన హృదయపూర్వకంగా అభినందించి ఆశీర్వదించారు. సమాజానికి ఆదర్శంగా నిలిచే ఈ సేవలను నిరంతరం కొనసాగించాలని ఆకాంక్షించారు.
శనివారం ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా సంస్థ చేపడుతున్న అనాథ మృతదేహాలకు గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించడం, నిరంతర అన్నదాన కార్యక్రమాలు, విధివంచితులకు సపర్య సేవలు తదితర మానవతా కార్యక్రమాల గురించి వివరించారు.
వాటిపై స్పందించిన చాగంటి కోటేశ్వరరావు, అనాథ ప్రేతానికి అంతిమ సంస్కారం చేయడం అంటే కేవలం ఒక మృతదేహాన్ని దహనం చేయడం కాదని, ఆ వ్యక్తి ఆత్మగౌరవానికి చివరి నివాళి అర్పించినట్లేనని పేర్కొన్నారు.
ఇటువంటి సేవ ప్రతి ఒక్కరి వల్ల సాధ్యం కాదని, సమాజానికి ఆదర్శంగా నిలిచే ఈ సేవలను నిరంతరం కొనసాగించాలని ఆకాంక్షించారు. సంస్థ సభ్యులందరికీ తన ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు.
సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ మధుకూరి సాయిబాబు తన జీవితాన్ని సమాజ సేవకు అంకితం చేసి, అనాథలకు అండగా నిలవడం అభినందనీయమని చాగంటి కొనియాడారు. సేవకు ప్రశంసలు అవసరం లేకపోయినా, సమాజ హితం కోసం నిస్వార్థంగా పనిచేసే వారిని ప్రోత్సహించడం తన బాధ్యతగా భావిస్తున్నానని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ, ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ మధుకూరి సాయిబాబు, ప్రధాన కార్యదర్శి వాలా బాలకిషన్, కోశాధికారి రాచర్ల రాజేష్ శర్మ, ఈసీ సభ్యుడు మద్ది గంగాధర్, కార్యవర్గ సభ్యులు కొండ నాగేందర్, పసునూరి వినయ్ కుమార్, అమృత్ ప్రసాద్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
