సిపి సాయి చైతన్య..చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఉత్సాహంగా రంగులు పూసుకొని ఆనందంగా హోలీ పండుగ జరుపుకోవాలని జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు.
గురువారం జిల్లా పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..
హోలీ వేళ రోడ్ల మీద తిరిగే వారిపై,ఇష్టం లేని వారిపై రంగులు చల్లడంలాంటివి చేస్తే సిటీ పోలిస్ యాక్ట్ అమల్లో ఉంటుందని, సెక్షన్ 22 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎక్కడా కూడా రోడ్లపై గుంపులుగా ర్యాలీలు నిర్వహించొద్దని సూచించారు.
అయితే ముఖ్యంగా రంజాన్ మాసం పైగా శుక్రవారం కావడంతో ఆరోజున ముస్లింలు చాలా నిష్టగా ఉంటారు. ఈ మేరకు ఎక్కడ కూడా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా గట్టి నిఘా ఉంచుతామని తెలిపారు.
పండగ సందర్భంగా ముఖ్యంగా యువకులు రేసింగ్ కు పాల్పడితే వాహనాలు సీజ్ చేస్తామని చెప్పారు. అదేవిధంగా జిల్లా అంతటా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీ నిర్వహిస్తారని, మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
యువకులు ఆన్‌లైన్ బెట్టింగులను వ్యసనంగా మార్చుకుని అధిక వడ్డీలకు అప్పులు చేసి, ఆ ఊబిలో కూరుకుపోతున్నారు. జిల్లాలో ఎక్కడైనా ఆన్లైన్ బెట్టింగ్ గేమ్ ఆడుతున్నట్లు తెలిస్తే సమాచారం ఇవ్వాలని కోరారు.
