నిజామాబాద్, మార్చి 16 : ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ప్రధాన సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ, ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్ లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు.
సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియ, ఇంచార్జి అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, డీఆర్డీఓ సాయగౌడ్, ఆర్డీఓ రాజేంద్ర కుమార్, బోధన్ ఏ.సీ.పీ శ్రీనివాస్ లతో కలిసి కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రజావాణి ఫిర్యాదులు స్వీకరించారు. 80 వినతులు అందగా, వాటి పరిష్కారం కోసం సంబంధిత శాఖల అధికారులకు అందించారు. ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం చేయవద్దని సూచించారు.
ఇదిలాఉండగా, ప్రజావాణి కార్యక్రమానికి పలువురు అధికారులు కొంత ఆలస్యంగా హాజరు కావడాన్ని గమనించిన కలెక్టర్, ప్రతి ఒక్కరు విధిగా సమయ పాలన పాటించాలని ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమం ప్రారంభం అయ్యే నిర్ణీత సమయం ఉదయం 10.30 గంటల వరకు అధికారులు అందరూ హాజరు అయి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
