న్యూఢిల్లీ: ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిర్వహించిన విద్యార్థుల నిరసన కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు, తెలంగాణ జన సమితి అధ్యక్షులు ప్రొ. కోదండరాం పాల్గొని విద్యార్థుల పోరాటానికి సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా ప్రొ. కోదండరాం మాట్లాడుతూ, నీట్ పరీక్షలో జరిగిన అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీకేజీకి బాధ్యులపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
అలాగే ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసే హక్కు ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని అన్నారు. విద్యార్థుల సమస్యలను అణచివేయకుండా, వారి ఆందోళనలను ప్రజాస్వామ్యబద్ధంగా పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో టి.జే.ఎస్ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షులు ఆకుల శ్రీనివాస్, వివిధ రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు, ప్రజాసంఘాల ప్రతినిధులు, ప్రజాస్వామ్యవాదులు పాల్గొన్నారు.
