పోలీసు విధి నిర్వహణలో వృత్తి నైపుణ్యం, సాంకేతిక పరిజ్ఞానం అత్యంత కీలకమని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయిచైతన్య అన్నారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న మూడవ పోలీస్ డ్యూటీ మీట్‌లో భాగంగా, గురువారం నిజామాబాద్ కమిషనరేట్ వేదికగా జోన్-2 (నిజామాబాద్, జగిత్యాల్, నిర్మల్, ఆదిలాబాద్) స్థాయి పోటీలను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. పోలీస్ శాఖలో క్షేత్రస్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు విధుల్లో రాణించాలంటే వృత్తిపరమైన మెళకువలు తప్పనిసరని పేర్కొన్నారు. నేరాల దర్యాప్తులో శాస్త్రీయ పద్ధతులను అనుసరించడం, ఫోరెన్సిక్, ఫింగర్ ప్రింట్ ఆధారాలను సేకరించడంలో నిపుణులుగా ఎదిగేందుకు ఈ పోటీలు ఎంతో దోహదపడతాయని వివరించారు.
మారుతున్న నేరాల తీరుకు అనుగుణంగా పోలీసులు తమను తాము ఆధునీకరించుకోవాలని, తద్వారా నేర పరిశోధనలో అత్యుత్తమ ఫలితాలు సాధించాలని ఆయన పిలుపునిచ్చారు. నిజామాబాద్ పోలీస్ హెడ్ క్వార్టర్స్, కమాండ్ కంట్రోల్ సెంటర్లలో ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. సైంటిఫిక్ ఎయిడ్స్, కంప్యూటర్స్, డాగ్ స్క్వాడ్, ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ, ఎక్స్‌ప్లోజివ్, నార్కోటిక్, ఫోరెన్సిక్ మెడిసిన్ వంటి అంశాల్లో ఎంపిక పరీక్షలు రెండు రోజుల పాటు కొనసాగుతాయి.
ఇక్కడ విజేతలుగా నిలిచిన వారు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కమిషనర్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అదనపు డి.సి.పి (అడ్మిన్) ఎన్. శుభం ప్రకాష్, ఏ.సి.పిలు ప్రకాష్ యాదవ్, రాజశేఖర్, శ్రీశైలం, గురునాయుడు, నరేందర్, డాక్టర్ నాగేంద్రబాబు, సి.ఐలు, ఎస్.ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
