సమాజంలో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అకృత్యాలను అరికట్టేందుకు, వారి భద్రతపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే లక్ష్యంగా ‘భరోసా సెంటర్’ పనిచేస్తోంది. ఇందులో భాగంగా ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక–99 రోజులు’ కార్యక్రమంలో భాగంగా, శనివారం ముగ్పాల్ మండలంలోని సిర్పూర్ గ్రామం మరియు నిజామాబాద్‌లోని సీఎంఆర్ షాపింగ్ మాల్ వద్ద ప్రత్యేక అవగాహన సదస్సులను నిర్వహించారు.
ఈ కార్యక్రమాలకు ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. ముగ్పాల్ ఏఎస్సై, పోలీసు సిబ్బంది సమక్షంలో నిర్వహించిన ఈ సదస్సుల్లో సుమారు 340 మందికి పైగా స్థానికులు, మహిళలు, విద్యార్థులు పాల్గొన్నారు.
ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా వినియోగం పెరిగిందని, అందులో ఎదురయ్యే ఆన్లైన్ వేధింపుల పట్ల మహిళలు, యువతులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. తెలియని వ్యక్తుల నుంచి వచ్చే లింకులను నమ్మవద్దని, సైబర్ నేరాల బారిన పడితే వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయాలని కోరారు.
బాలల భద్రత కోసం కఠినంగా అమలు చేస్తున్న పోక్సో చట్టంపై వివరించారు. భరోసా సెంటర్ ద్వారా బాధితులకు కల్పించే ఉచిత వైద్యం, చట్టపరమైన సహకారం, కౌన్సెలింగ్ వివరాలను వెల్లడించారు. సమాజంలో వివక్షను రూపుమాపి, సమాన అవకాశాలు కల్పించడంపై చర్చించారు.
ఆపదలో ఉన్నప్పుడు వెంటనే స్పందించేందుకు 100, 1098 నంబర్లు ఏ విధంగా ఉపయోగపడతాయో ప్రజలకు అవగాహన కల్పించారు.మహిళలు, పిల్లల భద్రత కోసం భరోసా సెంటర్ నిరంతరం కట్టుబడి ఉందని, ఇటువంటి కార్యక్రమాలను ముందుముందు మరిన్ని ప్రాంతాల్లో నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
