నకిలీ ధ్రువపత్రాలతో వైద్యులుగా చలామణి అవుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న 11 మందిని టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్, సికింద్రాబాద్ జోన్లలో ‘ప్రత్యేక ఆపరేషన్’లో భాగంగా విస్తృతంగా తనిఖీలు నిర్వహించిన పోలీసులు.. అర్హత లేకున్నా క్లినిక్లు ఏర్పాటు చేసి వైద్య సేవల పేరుతో సెలైన్లు, ఇంజక్షన్లు, మందులు ఇస్తున్న వారిని గుర్తించారు.
టాస్క్ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ తెలిపిన వివరాల ప్రకారం.. వైద్య విద్యార్హతలు లేకపోయినా కొందరు నకిలీ ధ్రువపత్రాలతో వైద్యులుగా చలామణి అవుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ప్రత్యేక బృందాలు పలు ప్రాంతాల్లో క్లినిక్లపై తనిఖీలు చేపట్టాయి.
ఈ సందర్భంగా 11 మంది నకిలీ వైద్యులను అదుపులోకి తీసుకున్నారు.పట్టుబడిన వారిలో ఓ మహిళ పారామెడికల్ కోర్సు పూర్తి చేసినప్పటికీ వైద్య సేవలు అందించేందుకు అవసరమైన అనుమతులు లేకుండా నాలుగేళ్లుగా క్లినిక్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
అక్కడ రోగులకు సెలైన్లు ఎక్కించడం, ఇంజక్షన్లు ఇవ్వడం, మందులు పంపిణీ చేయడం వంటి వైద్య సేవలు అందిస్తున్నట్లు తేలింది. తనిఖీల్లో పలు క్లినిక్ల నుంచి పెద్ద సంఖ్యలో సెలైన్ బాటిళ్లు, బీపీ పరీక్షించే పరికరాలు, సర్జికల్ కత్తెరలు, వివిధ రకాల మందులు తదితర వైద్య సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నకిలీ ధ్రువపత్రాల వ్యవహారంపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అర్హత లేకుండా వైద్య సేవలు అందిస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే వారిపై కఠిన చర్యలు తప్పవని టాస్క్ఫోర్స్ పోలీసులు హెచ్చరించారు.
