కాకతీయ లక్ష్మీ కాలువల ద్వారా ఆయకట్టు రైతులకు అందనన్న సాగునీరు- గుత్ప, అలీ సాగర్ ప్రాజెక్టులను నింపి జిల్లా రైతాంగాన్ని కాపాడాలని ప్రశాంత్ రెడ్డి డిమాండ్జాన
ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద నీరు రావడంతో ఆయకట్టు రైతులలో ఆశలు చిగురించాయి. ప్రాజెక్టు ద్వారా ఆయకట్టు రైతులకు బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గేట్లను ఎత్తివేసి నీటి విడుదలను ప్రారంభించారు.
లక్ష్మి, కాకతీయ కెనాల్ ల ద్వారా జిల్లాలోని ముప్కాల్, మెండోరా మండలాలతో పాటు పలు గ్రామాల ఆయకట్టు రైతులకు లబ్ధి చేకూరేలా ఈ నీటి విడుదల ఉపయోగపడుతుంది.
నీటిని విడుదల చేసిన సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ… ప్రభుత్వం బేషజాలు మాని జిల్లాలోని గుత్ప, అలీ సాగర్ ప్రాజెక్టులను నింపి సాగునీటి కొరత లేకుండా రైతన్నలను కాపాడాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాల కోసం జరిగిందని, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు మంచి పేరు వస్తుందనే ఆలోచనతో ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించడం తగదని అన్నారు.
90 వేల కోట్లతో నిర్మించిన కాలేశ్వరం, 4వేల కోట్లతో నిర్మించిన మేడిగడ్డ ప్రాజెక్టులకు రెండు పిల్లర్లు కుంగితే, దానిని తప్పు పట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం… రైతులకు నీళ్లు రాకుండా అడ్డుపడుతుందని విమర్శించారు. కాలేశ్వరం ప్రాజెక్టు నీళ్లు ఎత్తిపోయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తుందని అన్నారు.
ప్రభుత్వం తక్షణమే స్పందిస్తే ఎస్సారెస్పీ, వరద కాలువ, మిడ్ మానేరు, కొండ సాగర్, రంగన్న సాగర్, మల్లన్న సాగర్ ప్రాజెక్టులకు నీళ్లు సమృద్ధిగా వస్తాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయం చేస్తూ రైతులకు నష్టం చేయవద్దని పేర్కొన్నారు.
15 రోజుల క్రితమే లక్ష్మీ కెనాల్ ద్వారా నీరు ఇవ్వాలని కోరినప్పటికీ అధికారులు స్పందించలేదని వివరించారు . తాను మంత్రిగా పనిచేసిన గత ప్రభుత్వ హాయంలో ఎండాకాలంలో సైతం అలుగులు పారాయని గుర్తు చేశారు.
ఇప్పటికైనా అధికారులు ప్రభుత్వ నేతలు రైతాంగ సంక్షేమానికి కృషి చేయాలని సూచించారు. ఆయన వెంట పలువురు స్థానిక ప్రజా ప్రతినిధులతో పాటు నియోజకవర్గ స్థాయి నాయకులు పాల్గొన్నారు.