బీసీలకు రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ నాటకమాడుతోందని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. మాధవ నగర్ శివారులోని హోటల్ కృష్ణాలో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీల ఐక్యత చూసి స్థానిక సంస్థల ఎన్నికల్లో అగ్రవర్ణాలు నామినేషన్ వేయడానికి కూడా భయపడే పరిస్థితులు నెలకొన్నాయన్నారు.రాష్ట్రంలోని బీసీలంతా ఒక్కటయ్యారని..
2028లో బీసీలకు రాజ్యాధికారం వస్తుందని మల్లన్న జోస్యం చెప్పారు. బీసీలకు మించిన రాజకీయ శక్తి ఏదీ లేదని, తన వెనక ఉంది బీసీ ప్రజలేనని తెలిపారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల ఐక్యతే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. బీసీ లకు ఈ తెలంగాణ రాష్ట్రంలో రెడ్లకు వెలమలకు ఎప్పుడో బంధం తెగిపోయింది.
జయశంకర్ సార్ కలలుగన్న బీసీ రాజ్యం కోసం, జయశంకర్ సార్ తపించినటువంటి బీసీ సామ్రాజ్యం కోసం ఇవ్వాళ బీసీ జేఏసీ నడుము కట్టి ముందుకు వచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానల్లో బీసీ జేఏసీ తరఫున బీసీ బిడ్డలు బిసి కండువా కప్పుకొని బీసీ గుర్తుతోటే పోటీ చేస్తారు.
రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామంటున్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి పూర్తిగా నాటకమేనని తీన్మార్ మల్లన్న స్పష్టం చేశారు. రిజర్వేషన్ల పేరుతో సీఎం రేవంత్ రెడ్డి డ్రామా ఆడుతున్నారని విమర్శించారు.
బీసీలకు 42 శాతం కాదని 60 శాతం ఇవ్వాలని అన్నారు. ఎమ్మెల్సీ కవితతో తనకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. అయితే ఆమె బీసీ కాదని, బీసీ నినాదంతో కవితకు సంబంధం లేదని ఆరోపించారు.
నిజామాబాద్ జిల్లాలో 8 అసెంబ్లీ స్థానాలు జనరల్ ఉంటే కాంగ్రెస్ ఓసీలకు మాత్రమే సీట్లు కేటాయించిందని తీన్మార్ మల్లన్న ఆరోపించారు.
నిజామాబాద్ జిల్లాలో 25 లక్షల మంది బీసీ జనాభా ఉంటే ఒక్క బీసీ ఎమ్మెల్యే కూడా లేకపోవడం శోచనీయమన్నారు. కామారెడ్డిలో బీసీ ఎమ్మెల్యేగా ఉన్న గంప గోవర్ధన్ సీటును కూడా కేసీఆర్ లాక్కున్నాడని విమర్శించారు.
బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఓడినా.. గెలిచినా ఏడుసార్లు అవకాశం ఇచ్చిందని, అక్కడ ఓసీ జనాభా ఎంత ఉందని ప్రశ్నించారు.బీసీ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కు ప్రతిసారి ఎన్నికల్లో అసెంబ్లీ స్థానం మారుస్తూ అన్యాయం చేశారన్నారు.
తెలంగాణ ఉద్యమంలో బీసీ బిడ్డ బీజేపీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ తెలంగాణ కోసం రాజీనామా చేస్తే.. కిషన్ రెడ్డి రాజీనామా ఎందుకు చేయలేదని అన్నారు.
2009లో ధర్మపురి శ్రీనివాస్ ఎమ్మెల్యేగా గెలిస్తే బీసీ అయినా డీఎస్ ముఖ్యమంత్రి అయ్యేవాడు స్పష్టం చేశారు. సమావేశంలో తెలంగాణ బీసీ పొలిటికల్ జేఏసీ కో–ఆర్డినేషన్ కమిటీ ఛైర్మన్ హరి శంకర్ గౌడ్, సమన్వయకర్త జానయ్య యాదవ్, సూర్యారావు, నరయ్య గౌడ్, ఓదేలు యాదవ్, బుస్సాపూర్ శంకర్, రమేష్ యాదవ్, రమేష్ పటేల్, నరేందర్, సతీష్ గౌడ్, చంద్రశేఖర్, జ్యోతి, రేఖ, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
