రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెండు డీఏలు మంజూరు చేస్తామన్న ప్రభుత్వ హామీపై ఉద్యోగ సంఘాల నుంచి భిన్న స్పందనలు వ్యక్తమయ్యాయి. రెవెన్యూ ఉద్యోగుల సంఘం ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించింది.
ఉద్యోగులకు ఇక మంచి రోజులు రానున్నాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. అయితే రెండు డీఏలకే ప్రభుత్వం పరిమితం కావడంపై టీఎన్‌జీవో, టీజీవో సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బిల్లుల సమస్యను కూడా పరిష్కరించాలని కోరాయి.
ఈ అంశంపై ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి నుంచి స్పష్టమైన హామీ ఇవ్వాలని సంఘాల ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.ప్రభుత్వంతో జరిగిన చర్చల అనంతరం ఉద్యోగ సంఘాల నేతలు నాంపల్లిలోని టీఎన్‌జీవో భవన్‌లో అత్యవసరంగా సమావేశమయ్యారు.
డీఏలు, పెండింగ్ బిల్లులు, పీఆర్సీ తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై సంఘాల పరంగా తదుపరి కార్యాచరణపై నేతలు అభిప్రాయాలు వెల్లడించారు.
