రాష్ట్ర ప్రభుత్వ 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లావ్యాప్తంగా నిర్వహిస్తున్న “అరైవ్ అలైవ్” వారోత్సవాలు శనివారంతో ముగిశాయి. ఆరో రోజు కార్యక్రమంలో భాగంగా ఎడపల్లి మండల పరిధిలోని మంగళ్పహాడ్ చౌరస్తా వద్ద నిర్వహించిన అవగాహన సదస్సుకు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన డ్రైవర్లు, స్థానిక ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. జిల్లాలో కరోనా సమయంలో దాదాపు 200 మంది మృతి చెందగా.. గతేడాది (2025) ఒక్క రోడ్డు ప్రమాదాల వల్లే 302 మంది మరణించడంపై సీపీ ఆందోళన వ్యక్తం చేశారు.
“రోడ్డు ప్రమాదాలు ఇతర వ్యాధుల కంటే ప్రమాదకరంగా మారుతున్నాయి. అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం, డ్రైవింగ్ చేస్తూ సెల్ఫోన్ వాడటం వంటి చిన్నపాటి నిర్లక్ష్యాలే ఒక కుటుంబానికి తీరని నష్టాన్ని కలిగిస్తున్నాయి” అని ఆయన పేర్కొన్నారు.
ప్రజల్లో డిఫెన్సివ్ డ్రైవింగ్ (సురక్షిత డ్రైవింగ్) సంస్కృతి పెరగడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని వివరించారు. రోడ్డు ప్రమాదాలు జరిగిన వెంటనే స్పందించి, బాధితులను ‘గోల్డెన్ అవర్’లో (తొలి గంటలో) ఆసుపత్రికి తరలించే వ్యక్తులను ప్రభుత్వం ‘సహార్వీర్’ పథకం కింద రూ. 25 వేల నగదు పురస్కారంతో సత్కరిస్తుందని సీపీ వెల్లడించారు. ప్రమాదంలో ఉన్న వ్యక్తిని ఆదుకోవడం సామాజిక బాధ్యతని గుర్తు చేశారు.
అనంతరం రోడ్డు భద్రతపై అవగాహన కల్పించే గోడ పత్రికలు, కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా అందరితో రోడ్డు నిబంధనల అమలుపై ప్రతిజ్ఞ చేయించారు.
ఈ అవగాహన సదస్సులో బోధన్ ఏసీపీ శ్రీనివాస్, రూరల్ సీఐ విజయబాబు, ఎడపల్లి ఎస్సై రామ, రెంజల్ ఎస్సై చంద్రమోహన్, బోధన్ రూరల్ ఎస్సై మచ్చేందర్ రెడ్డి, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఆర్టీసీ సిబ్బంది, ఆటో డ్రైవర్లు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
