సామాజిక న్యాయం సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని విస్తరిస్తామని, బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు అమలయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత ప్రకటించారు.
సరూర్‌నగర్‌లో నిర్వహించిన సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభలో ఆమె మాట్లాడారు. సామాజిక న్యాయం కోసం చేపట్టిన ఈ సంకల్ప సభ దేశంలోని కోట్లాది మంది జీవితాల్లో మార్పు తీసుకురాగలదని ఆమె పేర్కొన్నారు.
రాజ్యాంగం సమానత్వాన్ని కల్పించినప్పటికీ సామాజిక న్యాయం పూర్తిస్థాయిలో అమలు కాలేదని, అందుకే మరో దశ ఉద్యమం అవసరమైందన్నారు.బీసీల గురించి మాట్లాడితే తనను అగ్రకులానికి చెందిన వ్యక్తినంటూ విమర్శిస్తున్నారని, అయితే తన పుట్టుక తన చేతిలో లేకపోయినా ఎవరి కోసం పని చేయాలనేది తన నిర్ణయమని స్పష్టం చేశారు.
అన్ని వర్గాలకు సామాజిక న్యాయం సాధించే వరకు తన జీవితాన్ని అంకితం చేస్తానన్నారు. బీసీ రిజర్వేషన్ల బిల్లును వచ్చే బడ్జెట్ సమావేశాల లోపు ఆమోదించి రాష్ట్రపతికి పంపించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.
లేనిపక్షంలో వెయ్యి కార్లతో ‘ఛలో ఢిల్లీ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని హెచ్చరించారు.దేశంలో బీసీల జనాభా అధికంగా ఉన్నప్పటికీ వారికి తగిన రాజకీయ ప్రాతినిధ్యం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్‌తో దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని చేపడతామని తెలిపారు.
సామాజిక న్యాయం అంటే ఎవరి హక్కులు లాక్కోవడం కాదని, సమాజంలోని ప్రతి వర్గానికీ సమాన అవకాశాలు కల్పించడమేనని చెప్పారు. దేశంలో వచ్చిన అనేక ప్రజాస్వామ్య మార్పులకు అగ్రవర్ణాల్లోని ప్రజాస్వామ్యవాదులే కారణమయ్యారని గుర్తు చేశారు. ఎస్సీ, ఎస్టీలకు ఉన్న బ్యాక్‌లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, వారి నిధులను వారి సంక్షేమానికే వినియోగించాలని డిమాండ్ చేశారు.
ఆదివాసీలకు అడవులపై పూర్తి హక్కులు, మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు, ముస్లింలకు హక్కులతో కూడిన రిజర్వేషన్లు, ట్రాన్స్‌జెండర్లకు సంపూర్ణ హక్కులు కల్పించాలని కోరారు.ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలకు అనుగుణంగా సామాజిక తెలంగాణ నిర్మాణమే లక్ష్యమని పేర్కొన్న కవిత.. ట్యాంక్‌బండ్‌పై ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మవిభూషణ్ పురస్కారం ప్రకటించాలని డిమాండ్ చేశారు.
మహాత్మా జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే దంపతులకు భారతరత్న ఇవ్వాలని కూడా తీర్మానం చేసినట్లు తెలిపారు.సామాజిక న్యాయం కోసం వచ్చే ఏడాది ఆగస్టు 6 వరకు రాష్ట్రవ్యాప్తంగా గ్రామగ్రామాన సభలు నిర్వహించి ఉద్యమాన్ని విస్తరిస్తామని కవిత వెల్లడించారు.
