విద్యార్థుల భద్రతే ప్రథమ ప్రాధాన్యం..స్కూల్ బస్సు డ్రైవర్లు, ఆయాలకు ట్రాఫిక్ అవగాహన సదస్సు విద్యార్థుల రవాణాలో అత్యంత అప్రమత్తత అవసరమని, వారి భద్రత విషయంలో నిర్లక్ష్యం వహించే ప్రసక్తే లేదని రాజేంద్రనగర్ రాజేంద్రనగర్ ట్రాఫిక్ పీఎస్ ఇన్‌స్పెక్టర్ సిహెచ్. రాజు స్పష్టం చేశారు.
బండ్లగూడలోని శ్రీ విద్యారణ్య ఇంటర్నేషనల్ స్కూల్‌లో మంగళవారం స్కూల్ బస్సు డ్రైవర్లు, ఆయాల కోసం నిర్వహించిన ప్రత్యేక ట్రాఫిక్ అవగాహన సదస్సులో వారు ఈ సూచనలు చేశారు. రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, గోషామహల్ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా ట్రాఫిక్ అధికారులు రోడ్డు భద్రతా నియమాలు, ట్రాఫిక్ నిర్వహణ పద్ధతులపై డ్రైవర్లకు క్షుణ్ణంగా వివరించారు. ముఖ్యంగా ప్రతి డ్రైవర్ ట్రాఫిక్ సంకేతాలు, హెచ్చరిక బోర్డులు, రోడ్డు మార్కింగ్‌లను తప్పనిసరిగా అనుసరించాలని సూచించారు. రియర్-వ్యూ మిర్రర్లను ఎలా వినియోగించుకోవాలి సురక్షితమైన ఓవర్‌టేకింగ్ పద్ధతులు ఏమిటి అనే అంశాలపై అవగాహన కల్పించారు.
స్కూల్ బస్సులో విద్యార్థులను ఎక్కించేటప్పుడు, దించేటప్పుడు డ్రైవర్లు, ఆయాలు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని, విద్యార్థుల భద్రతను పర్యవేక్షించడంలో ఎటువంటి పొరపాట్లు జరగకూడదని హెచ్చరించారు.
రౌండ్‌అబౌట్‌ల వద్ద పాటించాల్సిన నిబంధనలతో పాటు, ట్రాఫిక్ చట్టాల ఉల్లంఘన వల్ల కలిగే పరిణామాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో గోషామహల్ టీటీఐ హెడ్ కానిస్టేబుల్ వేణుగోపాల్, శ్రీ విద్యారణ్య ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపాల్ రమావిశ్వనాధన్ తదితరులు పాల్గొన్నారు.
