HomeCRIMEచిన్నారుల ఆసుపత్రుల్లో భద్రతపై నిఘా..ఫైర్‌ సేఫ్టీపై ప్రత్యేక సమీక్ష.. లోపాలుంటే వెంటనే సరిదిద్దాలి..అత్యవసర పరిస్థితుల్లో మాక్‌డ్రిల్స్‌...

చిన్నారుల ఆసుపత్రుల్లో భద్రతపై నిఘా..ఫైర్‌ సేఫ్టీపై ప్రత్యేక సమీక్ష.. లోపాలుంటే వెంటనే సరిదిద్దాలి..అత్యవసర పరిస్థితుల్లో మాక్‌డ్రిల్స్‌ నిర్వహించాలని సీపీ సాయి చైతన్య సూచన

ఆదిలాబాద్‌ రిమ్స్‌లో చోటుచేసుకున్న ఘటన నేపథ్యంలో నిజామాబాద్‌ జిల్లాలో చిన్నారులకు వైద్య సేవలందిస్తున్న ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో భద్రతా ప్రమాణాలపై పోలీస్‌ కమిషనర్‌ సాయి చైతన్య, ప్రత్యేక దృష్టి సారించారు.

ఆసుపత్రుల్లో అగ్నిప్రమాదాల నివారణ, అత్యవసర సమయాల్లో రోగుల తరలింపు, ఫైర్‌ సేఫ్టీ పరికరాల పనితీరుపై గురువారం కమాండ్‌ కంట్రోల్‌ హాల్‌లో సమీక్ష నిర్వహించారు. పోలీస్‌ కమిషనర్‌ పి.సాయి చైతన్య, డీఎంహెచ్‌వో బి.రాజశ్రీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల నిర్వాహకులు, వైద్యులు, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు.

ఫైర్‌ సేఫ్టీపై దృష్టి: ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న అగ్నిమాపక పరికరాలు పనిచేస్తున్నాయా? అత్యవసర నిష్క్రమణ మార్గాలు సక్రమంగా ఉన్నాయా? ఫైర్‌ అలారం వ్యవస్థ, విద్యుత్‌ భద్రత ఎలా ఉంది? సిబ్బందికి అగ్నిప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన ఉందా? అనే అంశాలను సమీక్షించారు.

ముఖ్యంగా చిన్నారులు చికిత్స పొందుతున్న ప్రాంతాల్లో భద్రతా లోపాలకు తావులేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. మాక్‌డ్రిల్స్‌ తప్పనిసరి: అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, వైద్య సిబ్బంది సమన్వయంతో వేగంగా స్పందించేలా ఆసుపత్రుల్లో అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని సీపీ సూచించారు.

తరచూ మాక్‌డ్రిల్స్‌ నిర్వహించి సిబ్బందిని అప్రమత్తం చేయాలని పేర్కొన్నారు. భద్రతా ప్రమాణాల అమలులో నిర్లక్ష్యం వహించకుండా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, లోపాలు గుర్తిస్తే వెంటనే సరిదిద్దాలని ఆదేశించారు.

చిన్నారులు, వారి తల్లిదండ్రులు, ఆసుపత్రికి వచ్చే ప్రజలకు సురక్షిత వాతావరణం కల్పించేందుకు పోలీస్‌, వైద్య ఆరోగ్య, ఫైర్‌ సర్వీసెస్‌ శాఖలు ఆసుపత్రుల యాజమాన్యాలతో సమన్వయంతో పనిచేయాలని సీపీ సూచించారు.

సమావేశంలో అదనపు డీసీపీ ఎన్‌.శుభం ప్రకాష్‌, జిల్లా ఫైర్‌ అధికారి టి.పరమేశ్వర్‌, డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ శ్రీనివాస ప్రసాద్‌, ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్‌ విశాల్‌, ఎన్‌ఎస్‌సీ అధ్యక్షురాలు డాక్టర్‌ కవితారెడ్డి, విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ పి.వి.రాజేశ్వర్‌రావు, ఏసీపీలు ప్రకాష్‌, వెంకటేశ్వర్‌రెడ్డి, శ్రీనివాస్‌, మస్తాన్‌ అలీ, గురునాయుడు, స్పెషల్‌ బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీధర్‌రెడ్డి, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments