HomeTelanganaHyderabadదానం ‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు.....హైకోర్టు తీర్పు సమర్ధన .....ఉప ఎన్నిక అనివార్యం

దానం ‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు…..హైకోర్టు తీర్పు సమర్ధన …..ఉప ఎన్నిక అనివార్యం


ఖైరతాబాద్ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆయనను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటిస్తూ తెలంగాణ హై కోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు గురువారం కొట్టివేసింది.

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జాయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్‌ వి. మోహనలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. దీనితో దానం ఎమ్మెల్యే పదవి కోల్పోనున్నారు ఖైరాతాబాద్ నియోజకవర్గం కు ఉప ఎన్నిక అనివార్యం అయింది

భారత రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌ (యాంటీ డిఫెక్షన్ చట్టం) కింద దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేసే విషయంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పు చట్టాన్ని సరైన రీతిలో అర్థం చేసుకుని ఇచ్చిందని పేర్కొంది.

విచారణ సందర్భంగా జస్టిస్‌ జాయ్‌మాల్య బాగ్చీ సరదాగా వ్యాఖ్యానిస్తూ.. 2023లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్‌.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన విషయాన్ని ప్రస్తావించారు. “మీకు ఎమ్మెల్యేగా ఒక ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ ఉంది. ఎంపీగా షేర్‌ మార్కెట్‌లో ప్రయత్నించారు. ఇప్పుడు ఆ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ను కూడా కోల్పోయారు” అని వ్యాఖ్యానించారు.

దానం నాగేందర్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. పార్టీ సభ్యత్వాన్ని వదులుకున్న సభ్యుడి చర్యను పార్టీ క్షమించే అవకాశం పదో షెడ్యూల్‌లో ఉందని ఆయన వాదించారు.


పదో షెడ్యూల్‌లోని పేరా 2(1)(బి)ని ప్రస్తావించిన రోహత్గీ.. పార్టీ ఆదేశాలకు (విప్‌) విరుద్ధంగా ఓటు వేసిన సభ్యుడి చర్యను పార్టీ క్షమించే అవకాశం ఉందని తెలిపారు. అయితే ధర్మాసనం ఈ వాదనను తోసిపుచ్చింది. పేరా 2(1)(బి) నిబంధన కేవలం పార్టీ విప్‌కు వ్యతిరేకంగా ఓటు వేయడం వంటి అంశాలకు మాత్రమే వర్తిస్తుందని, పార్టీ సభ్యత్వాన్ని వదులుకోవడానికి సంబంధించిన పేరా 2(1)(ఎ)కు అది వర్తించదని స్పష్టం చేసింది.


వాదనలు విన్న ధర్మాసనం.. తెలంగాణ హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోవడానికి ఎలాంటి కారణం లేదని స్పష్టం చేస్తూ దానం నాగేందర్‌ పిటిషన్‌ను కొట్టివేసింది.


2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో దానం నాగేందర్‌ ఖైరతాబాద్‌ నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం ఆయన కాంగ్రెస్‌లో చేరారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేశారు.

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేగా కొనసాగుతూనే కాంగ్రెస్‌ అభ్యర్థిగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హతకు దారితీస్తుందని తెలంగాణ హైకోర్టు తేల్చింది.

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను తిరస్కరించిన నిర్ణయాన్ని హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ పక్కనపెట్టింది.

చీఫ్‌ జస్టిస్‌ అపరేష్‌ కుమార్‌ సింగ్‌, జస్టిస్‌ జీఎం మొహియుద్దీన్‌తో కూడిన డివిజన్‌ బెంచ్‌ దానం నాగేందర్‌ అనర్హతకు గురైనట్లు పేర్కొంది. దీంతో ఖైరతాబాద్‌ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్లు పరిగణించి తాజా ఎన్నికకు మార్గం సుగమం అవుతుందని తెలిపింది.

2024 ఏప్రిల్‌ 23న సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా దానం నాగేందర్‌ పోటీ చేసిన తేదీ నుంచే ఆయన అనర్హత అమల్లోకి వస్తుందని హైకోర్టు తన తీర్పులో పేర్కొంది.

అనర్హత వేటు ఉత్తర్వులను అప్పీల్‌ చేసుకునే అవకాశం కల్పిస్తూ తాత్కాలికంగా నిలిపివేయాలన్న దానం నాగేందర్‌ తరఫు న్యాయవాది అభ్యర్థనను కూడా హైకోర్టు తిరస్కరించింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments