HomeTelanganaNizamabadయూరియా కోసం కర్షక పోరు.. స్మార్ట్ ఫోన్ లేని రైతుకు ‘ఎరువు’ ఎండమావేనా?రోడ్డెక్కుతున్న రైతులు..

యూరియా కోసం కర్షక పోరు.. స్మార్ట్ ఫోన్ లేని రైతుకు ‘ఎరువు’ ఎండమావేనా?రోడ్డెక్కుతున్న రైతులు..

పాలకులు మారుతున్నారు.. పథకాలు వస్తున్నాయి.. కానీ మట్టిని నమ్ముకున్న రైతన్న తలరాత మాత్రం మారడం లేదు. అన్నదాతకు అండగా ఉంటామని చెప్పే ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ఫర్టిలైజర్‌ బుకింగ్‌ యాప్’ ఇప్పుడు జిల్లా రైతులకు ఉరితాడుగా మారింది. సాంకేతికత పేరిట ప్రవేశపెట్టిన ఈ కొత్త విధానం సామాన్య, నిరక్షరాస్య రైతులకు శాపంగా పరిణమించింది.

యూరియా కోసం రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నా.. పాలకుల్లో చలనం లేదు, అధికారుల్లో జవాబుదారీతనం లేదు. జిల్లాలోని మెజారిటీ రైతుల వద్ద ఉన్నవి సాధారణ ‘డబ్బా ఫోన్లు’ మాత్రమే. స్మార్ట్ ఫోన్ అంటే ఏమిటో తెలియని, ఓటీపీ అంటే అర్థం కాని వృద్ధ రైతులు ఇప్పుడు యూరియా బస్తా కోసం అల్లాడిపోతున్నారు.

“మాకు చదువు రాదు.. ఫోన్‌లో బుక్ చేయడం తెలియదు.. మరి మాకు యూరియా దొరికేదెట్లా?” అని ఓ వృద్ధ రైతు కన్నీటి పర్యంతమవ్వడం క్షేత్రస్థాయిలో పరిస్థితికి అద్దం పడుతోంది. చదువుకున్న వారే యాప్‌ను ఆపరేట్ చేయలేక తలలు పట్టుకుంటుంటే, అమాయక రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.

యూరియా పంపిణీలో జరుగుతున్న తంతు చూస్తుంటే పెను కుంభకోణం జరుగుతోందన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఏదైనా దుకాణానికి 400 బస్తాలు వచ్చిందని సమాచారం రాగానే.. యాప్ ఓపెన్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోనే ‘నో స్టాక్’ అని బోర్డు దర్శనమిస్తోంది.

రెప్పపాటు కాలంలో వందలాది బస్తాలు ఎవరు బుక్ చేస్తున్నారు? ఎక్కడికి తరలుతున్నాయి? అన్న ప్రశ్నలకు సమాధానం లేదు. అధికారుల లెక్కల్లో జిల్లాలో సరిపడా యూరియా పంపిణీ జరిగిందని చెబుతున్నా.. మరి రైతులు ఎందుకు రోడ్డెక్కుతున్నారు? యాప్‌ల ద్వారా బుక్ అయిన యూరియా బ్లాక్ మార్కెట్‌కు తరలుతోందా? అనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

యూరియాను పాత పద్ధతిలోనే పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డుపై బైఠాయించారు. పలువురు రైతులు గోదాముకు యూరియా వచ్చిందని తెలిసి రైతులు భారీగా చేరుకున్నారు. అయితే, ‘యాప్ ద్వారా బుకింగ్ చేసుకున్న వారికే ఇస్తాం’ అని సిబ్బంది తెగేసి చెప్పడంతో అన్నదాతల ఆగ్రహం కట్టలు తెంచుకుంది.

పంట పొట్ట దశకు చేరుకుందని, ఇప్పుడు యూరియా వేయకపోతే దిగుబడి దెబ్బతింటుందని మొత్తుకున్నా అధికారులు కనికరించలేదు. దీంతో ఆగ్రహించిన రైతులు రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

సాంకేతికత పేరిట రైతులను ఇబ్బందులకు గురిచేయడం మానుకోవాలని జిల్లా రైతాంగం డిమాండ్ చేస్తోంది. పాత పద్ధతిలోనే గుర్తింపు కార్డుల ఆధారంగా యూరియా పంపిణీ చేయాలని, యాప్ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని కోరుతున్నారు.

లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం స్పందించి క్షేత్రస్థాయిలో యూరియా కొరతను తీర్చకపోతే.. పంటలు ఎండిపోయి రైతులు కోలుకోలేని దెబ్బతింటారనడంలో సందేహం లేదు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments