Thursday, April 30, 2026
HomeTelanganaNizamabadఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుదారులకు 'బంపర్‌ ఆఫర్‌'ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజులో 25 శాతం భారీ తగ్గింపు..

ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుదారులకు ‘బంపర్‌ ఆఫర్‌’ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజులో 25 శాతం భారీ తగ్గింపు..

రాష్ట్రంలో ఎల్‌ఆర్‌ఎస్‌ (లేఅవుట్‌ క్రమబద్ధీకరణ పథకం) కోసం ఏళ్ల తరబడి వేచి చూస్తున్న సామాన్యులకు ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల పరిష్కారమే లక్ష్యంగా, చెల్లించాల్సిన ఫీజు మొత్తంలో ఏకంగా 25 శాతం రాయితీ ఇస్తున్నట్లు ప్రకటించింది.

ఈ మేరకు మున్సిపల్‌ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ బుధవారం జీవో నంబర్‌ 131ని విడుదల చేశారు. ప్రభుత్వం ప్రకటించిన ఈ రాయితీ ప్రయోజనం పొందాలంటే నిర్ణీత గడువులోగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

ఎల్‌ఆర్‌ఎస్‌-2020 కింద దరఖాస్తు చేసుకున్న అర్హులైన ప్లాట్‌ యజమానులందరికీ ఈ వెసులుబాటు కల్పించారు. 2026 మే 1 నుంచి జులై 31 వరకు మూడు నెలల కాలపరిమితిలో ఫీజు కట్టిన వారికి మాత్రమే 25 శాతం డిస్కౌంట్‌ వర్తిస్తుంది.

నిధుల కొరతతోనో లేదా సాంకేతిక కారణాలతోనో ఫీజులు చెల్లించలేక ఆగిపోయిన మధ్యతరగతి ప్రజలకు ప్రభుత్వ నిర్ణయం పెద్ద వరంగా మారనుంది. ఆర్థిక భారంతో సతమతమవుతున్న ప్లాట్ల యజమానులకు వెయ్యి నుంచి లక్షల రూపాయల వరకు ఆదా అయ్యే అవకాశం ఉంది.

ఏళ్ల నాటి సమస్యకు ముగింపు పలకడమే కాకుండా, ప్రజలపై ఆర్థిక భారం తగ్గించాలనే సంకల్పంతో ప్రభుత్వం ఈ కీలక అడుగు వేసింది. పెండింగ్‌ దరఖాస్తుల క్లియరెన్స్‌తో రాష్ట్రవ్యాప్తంగా వేలాది మందికి లబ్ధి చేకూరనుంది.

“ఇది ప్లాట్ల యజమానులకు లభించిన అరుదైన అవకాశం.. తక్షణమే సద్వినియోగం చేసుకొని మీ ఆస్తులను క్రమబద్ధీకరించుకోండి” అని అధికారులు స్పష్టం చేస్తున్నారు. తాజా జీవోతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో ఉన్న వేలాది ప్లాట్లు ఇప్పుడు చట్టబద్ధం కానున్నాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!