మున్సిపల్ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులకు ఇప్పుడు ‘లెక్కల’ భయం పట్టుకుంది. ఎన్నికల వేళ ప్రచారంలో జోరు చూపించిన నాయకులు, ఆ ఖర్చుల వివరాలను అధికారులకు సమర్పించడంలో మాత్రం మీనమేషాలు లెక్కిస్తున్నారు. మున్సిపల్ చట్టం-2019 ప్రకారం ఎన్నికల ఫలితాలు వచ్చిన నాటి నుంచి నిర్ణీత గడువులోగా వ్యయ వివరాలను సమర్పించాల్సి ఉండగా, జిల్లాలో మెజారిటీ అభ్యర్థులు ఇంకా స్పందించలేదు.
ఈ నెల 29వ తేదీ నాటికి గడువు ముగుస్తుండటంతో అధికారులు కసరత్తు వేగవంతం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్పష్టమైన ఖర్చు పరిమితిని నిర్ణయించింది. కౌన్సిలర్ అభ్యర్థికి: రూ. 1 లక్షలోపు. కార్పొరేటర్ అభ్యర్థికి: రూ. 5 లక్షల వరకు. నామినేషన్ వేసిన నాటి నుంచి ఫలితాల వరకు చేసిన ప్రతి పైసా ఖర్చును అభ్యర్థులు ప్రత్యేకంగా తెరిచిన బ్యాంకు ఖాతా ద్వారానే నిర్వహించాలి.
ఫలితాలు వెలువడిన 40 నుంచి 45 రోజుల వ్యవధిలో అసలు బిల్లులను జిల్లా ఎన్నికల అధికారికి నివేదించాలి. వాస్తవంగా ఎన్నికల్లో జరిగిన ఖర్చుకు, కమిషన్ నిర్ణయించిన పరిమితికి అగాధమే కనిపిస్తోంది. అభ్యర్థులు ఎన్నికల్లో సాధారణ ఎన్నికలను మించిన స్థాయిలో ధన ప్రవాహం పారించినట్లు ఆరోపణలు ఉన్నాయి. కొందరు అభ్యర్థులు రోజుకు రూ. 50 వేల నుంచి రూ. 65 వేల వరకు వెచ్చించినట్లు తెలుస్తోంది.
అధికారుల ప్రత్యక్ష పర్యవేక్షణ కొరవడటంతో అభ్యర్థులు సమర్పించే లెక్కలే ఫైనల్ అన్నట్లుగా సాగుతోంది. జిల్లాలోని కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో పోటీ చేసిన అభ్యర్థుల సంఖ్యకు, ఖర్చు వివరాలు ఇచ్చిన వారికి అస్సలు పొంతన లేదు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వివిధ మున్సిపాలిటీల్లో పోటీ చేసిన అభ్యర్థుల వివరాలు చూస్తే.. చాలా మంది ఇంకా లెక్కలు తేల్చలేదు.
నిజామాబాద్ కార్పొరేషన్ 60 డివిజన్లలో 350 మంది పోటీ చేయగా, సమర్పించిన వారు కొద్దిమందే. ఆర్మూర్: 153 మందికి గాను కేవలం 51 మంది మాత్రమే వివరాలు ఇచ్చారు. 162 మంది అభ్యర్థుల్లో సుమారు 10 నుంచి 15 మంది మాత్రమే స్పందించారు. భీమ్గల్: ఇక్కడ 49 మంది పోటీ చేశారు. వీరందరు నిర్దేశించిన గడువులోగా (ఈ నెల 29 లోపు) ఎన్నికల ఖర్చుల వివరాలు సమర్పించని అభ్యర్థులపై ఎన్నికల కమిషన్ ఉక్కుపాదం మోపనుంది.
గెలిచిన అభ్యర్థులు వివరాలు ఇవ్వకుంటే వారి ఎన్నిక చెల్లదు. పదవిని కోల్పోయే అవకాశం ఉంది.అలాగే ఓడిన అభ్యర్థులు వివరాలు సమర్పించకుంటే వచ్చే మూడేళ్ల వరకు ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయకుండా అనర్హత వేటు పడుతుంది. ఐదేళ్ల తర్వాత వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులుగా పరిగణించబడతారనే నిబంధన అమలులో ఉంది.
అభ్యర్థులు ఈ స్వల్ప గడువులోనైనా మేల్కొని లెక్కలు తేల్చుకుంటారో లేక ఎన్నికల కమిషన్ చర్యలకు గురవుతారో వేచి చూడాలి
