HomeTelanganaNizamabadకుల గణన, వర్గీకరణతో దేశానికే దిక్సూచిగా తెలంగాణ..అణగారిన వర్గాల గళం అన్నాభావు సాఠే: టీపీసీసీ అధ్యక్షులు...

కుల గణన, వర్గీకరణతో దేశానికే దిక్సూచిగా తెలంగాణ..అణగారిన వర్గాల గళం అన్నాభావు సాఠే: టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్..

ఎస్సీ వర్గీకరణ, కుల గణనను అత్యంత పారదర్శకంగా అమలు చేస్తూ తెలంగాణ రాష్ట్రం దేశానికే రోల్ మోడల్‌గా నిలిచిందని టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. ఆదివారం నిజామాబాద్‌లో నిర్వహించిన అన్నాభావు సాఠే జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సాఠే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశంలో దళిత సాహిత్యానికి అన్నాభావు సాఠే దిశానిర్దేశం చేశారని, పేదలు, అణగారిన వర్గాల జీవన వాస్తవాలను తన రచనల ద్వారా ప్రపంచానికి చాటిన గొప్ప ప్రజాకవి అని కొనియాడారు.

రాహుల్ గాంధీ ఆకాంక్ష మేరకు ఎవరి జనాభా ఎంత ఉంటే వారికి అంత వాటా దక్కాలనే నినాదంతో ప్రజా పాలన సాగిస్తున్నట్లు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఎన్నికల వరకే రాజకీయాలని, ఆ తర్వాత కేవలం అభివృద్ధి ధ్యేయంగానే ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేశారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ప్రజలకు అందిస్తున్నామని చెప్పారు. ఇందిరమ్మ రాజ్యంలోని సంక్షేమ పథకాలను ఆయన ఈ సందర్భంగా ఏకరువు పెట్టారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని వివరించారు.

అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. సన్నబియ్యం పంపిణీతో పేదల ఆకలి తీరుస్తున్నామని పేర్కొన్నారు.సామాజిక న్యాయానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, యువత అన్నాభావు సాఠే జీవితాన్ని ప్రేరణగా తీసుకుని సమాజ హితం కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు, ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments