HomeTelanganaNizamabadముంచుకొస్తున్నా "అమృత్‌" గడువు..! 45 వేల కనెక్షన్ల లక్ష్యం.. పూర్తయింది 8,500 మాత్రమే గడువు ముగుస్తున్నా.....

ముంచుకొస్తున్నా “అమృత్‌” గడువు..! 45 వేల కనెక్షన్ల లక్ష్యం.. పూర్తయింది 8,500 మాత్రమే గడువు ముగుస్తున్నా.. ముందుకు సాగని పనులు ఆగస్టులోగా పూర్తయ్యేనా..? డిసెంబరు వరకు గడువు పొడిగింపునకు యత్నాలు? ‘మెగా’ వేగం ఇదేనా..?

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమృత్‌ పథకం కింద నిజామాబాద్‌ నగరంలో చేపట్టిన అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ పనులకు గడువు ముంచుకొస్తున్నా.. పురోగతి మాత్రం ఆశించిన స్థాయిలో కనిపించడం లేదు. భారీ ప్రాజెక్టును దక్కించుకున్న ‘మెగా’ సంస్థ పనుల వేగంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఆగస్టు చివరి నాటికి పనులన్నీ పూర్తి చేయాల్సి ఉండగా.. ఇప్పటివరకు 20 శాతం పనులు కూడా పూర్తికాలేదు. ఈ అమృత్‌ పథకం కింద సుమారు 45 వేల ఇళ్లకు యూజీడీ కనెక్షన్లు ఇవ్వాల్సి ఉంది. ఆగస్టు చివరి నాటికి ఈ పనులన్నీ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

అయితే ఇప్పటివరకు సుమారు 8,500 ఇళ్లకే కనెక్షన్లు పూర్తయినట్లు సమాచారం. అంటే లక్ష్యంలో కేవలం 18.89 శాతం మాత్రమే పూర్తయింది. ఇంకా 36,500 ఇళ్లకు కనెక్షన్లు ఇవ్వాల్సి ఉంది. మిగిలిన కొద్దిరోజుల్లో ఈ స్థాయి పనులను ఎలా పూర్తి చేస్తారన్నది ప్రశ్నగా మారింది. ప్రధాన సీవర్‌ నెట్‌వర్క్‌ పనుల పరిస్థితి కూడా అంతంతమాత్రంగానే ఉంది.

మొత్తం 90 కిలోమీటర్ల మేర కొత్త సీవర్‌ పైప్‌లైన్‌ వేయాల్సి ఉండగా.. ఇప్పటివరకు 36 కిలోమీటర్లు మాత్రమే పూర్తయినట్లు లెక్కలు చెబుతున్నాయి. అంటే 40 శాతం పనులే పూర్తయ్యాయి.

మరో 54 కిలోమీటర్ల పైప్‌లైన్‌ పనులు మిగిలి ఉన్నాయి.కొత్తగా సుమారు 4 వేల మ్యాన్‌హోల్స్‌ నిర్మించాల్సి ఉండగా.. ఇప్పటివరకు దాదాపు 1,200 మాత్రమే పూర్తయినట్లు సమాచారం.

అంటే 30 శాతం పనులే పూర్తయ్యాయి. ఇంకా సుమారు 2,800 మ్యాన్‌హోల్స్‌ నిర్మించాల్సి ఉంది. ఈ గణాంకాలను పరిశీలిస్తే ఆగస్టు గడువులోగా మొత్తం ప్రాజెక్టు పూర్తవుతుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పనులు ప్రారంభమైన సమయంలో పెద్ద సంఖ్యలో బృందాలను రంగంలోకి దించిన సంస్థ..

ప్రస్తుతం జోన్ల వారీగా పరిమిత బృందాలతోనే పనులు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. సుమారు 18 గ్రూపులు పనిచేస్తున్నట్లు సమాచారం. పైపులు, ఇతర నిర్మాణ సామగ్రి అందుబాటులో లేకపోవడం, సాంకేతిక సమస్యల కారణంగా పనుల్లో జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది.

ఆగస్టు చివరి నాటికి పనులు పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ.. ప్రస్తుత వేగాన్ని బట్టి డిసెంబరు వరకు గడువు పొడిగించాలని కోరుతూ దరఖాస్తులు పెట్టుకున్నట్లు సమాచారం. అదే నిజమైతే.. మొదట నిర్ణయించిన గడువులోగా పనులు పూర్తి చేయలేని పరిస్థితి ఎందుకు వచ్చిందన్నది చర్చనీయాంశంగా మారింది.

భారీ ప్రాజెక్టును దక్కించుకున్న సంస్థకు అవసరమైన సామగ్రి, సిబ్బందిని ముందుగానే సమకూర్చుకుని పనులను వేగవంతం చేయాల్సిన బాధ్యత లేదా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

గడువు సమీపిస్తుండటంతో చివరి రోజుల్లో పనులను హడావుడిగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తే నాణ్యతపై ప్రభావం పడే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. సంబంధిత అధికారులు పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ.. కాంట్రాక్టు సంస్థకు స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించి వాటిని చేరుకునేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

45 వేల ఇంటి కనెక్షన్లు.. 90 కి.మీ. సీవర్‌ నెట్‌వర్క్‌.. 4 వేల మ్యాన్‌హోల్స్‌ లక్ష్యాల్లో ఇప్పటివరకు పూర్తయిన పనులపై జిల్లా ఉన్నతాధికారులు స్పష్టమైన వివరాలను వెల్లడించాల్సిన అవసరం ఉంది. ఆగస్టు గడువులోగా లక్ష్యాన్ని చేరుకుంటారా? లేక డిసెంబరు వరకు గడువు పొడిగించుకుని ప్రాజెక్టును మరింత సాగదీస్తారా? అన్నది వేచి చూడాల్సిందే.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments