వేలాది మంది పేద ప్రజల వైద్యసేవల కోసం అందుబాటులోకి వచ్చిన గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రి సవాలక్ష సమస్యలతో సతమతం అవుతుంది.ప్రతికూల పరిస్థితులు అధిగమించి వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రి నిర్వహణ కోసం ఏర్పాటైన అభివృద్ధి కమిటీ అడ్రస్ లేకుండా పోయింది.
కనీసం ఆరు మాసాలకోసారైనా సమావేశం కావాల్సిన ఈ కమిటీ ఏళ్ల తరబడిగా కొలువు దీర లేక పోతుంది.25 మంది సభ్యులున్న ఈ కమిటి లో ఇద్దరు ఎంపీ లు ముగ్గురు ఎమ్మెల్యే లున్నారు సాక్ష్యాత్తు జిల్లా కలెక్టర్ ఛైర్మెన్ గావైద్య విద్యాశాఖ డైరెక్టర్ వైస్ ఛైర్మెన్ గా ఉన్నారు మిగితా వారంతా సభ్యులుగా ఉన్నారు.
కానీ అభివృద్ధి కమిటి ఎందుకు క్రమం తప్పకుండ భేటీ కావడం లేదనేది ఎవ్వరు స్పష్టత ఇవ్వడం లేదు. ప్రజాసేవలో తరిస్తున్నామని బీరాలు పలికే ఎంపీ లు ఎమ్మెల్యే ల్లో సైతం ఈ సమావేశాల ధ్యాస లేకుండా పోయింది.
మెడికల్ కాలేజీ మా వల్లే వచ్చిదంటూ తరుచు బాకాలు ఊదే నేతలు సైతం మీటింగ్ లు పెట్టాలని ఎందుకు ఆఫీసర్ల ను పురమాయించ లేక పోతున్నారు.పాలనా వ్యవహారాల్లో పెత్తనం చెలాయించే ప్రజా ప్రతినిధులు ధర్మాసుపత్రి దుస్థితి ఫై తమకేమి సోయే లేదన్నట్లుగా వుంటున్నారు.
మెడికల్ కాలేజీ లో ఈవెంట్ లకు వెళ్లి బిల్డప్ లు ఇచ్చే వారూ అభివృద్ధి భేటీలు లైట్ తీసుకుంటున్నారు మెడికల్ కాలేజీ కి ఈ ఆసుపత్రి అనుబంధంగా వుండడం వల్ల వైద్య నిపుణులు అందుబాటులో ఉన్నారు అనేక అధునాత వైద్య పరికరాలు సైతం ఎప్పుడో సమకూరాయి.
అయినప్పటికి ఆసుపత్రి కి వచ్చే రోగులకు అనేక అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఆసుపత్రి కార్యనిర్వహణ సంక్లిష్టంగా మారింది.ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులు తమకేమి అభివృద్ధిపై సమీక్షించి నిర్ణయాలు తీసుకునే బాధ్యత ఉన్నా.. ఆ వ్యవస్థే సక్రమంగా పనిచేయకపోవడం గమనార్హం.
నూతన ఆస్పత్రి అందుబాటులోకి వచ్చి ఐదారేళ్లు గడిచినా మౌలిక వసతుల లోపాలు కొనసాగుతుండగా.. మృతదేహాలను భద్రపరిచే మార్చురీలో కనీసం ఫ్రిజ్‌లు కూడా లేకపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
అధికారులు తనిఖీలు చేయడం, సమావేశాల్లో సమస్యలను ప్రస్తావించడం, పరిష్కరిస్తామని హామీలు ఇవ్వడం జరుగుతున్నా.. నిర్ణయాల అమలు, పర్యవేక్షణ మాత్రం కొరవడటంతో ప్రజలకు ఉపయోగపడాల్సిన అభివృద్ధి కమిటీ కాగితాలకే పరిమితమైందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఈ కమిటీలో జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా, వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ వైస్ చైర్మన్‌గా ఉన్న ఈ కమిటీలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, మేయర్ కూరగాయల ఉమారాణి, మున్సిపల్ కమిషనర్ దిలీప్‌కుమార్, డీఎంహెచ్‌వో రాజశ్రీ, ఆస్పత్రి సూపరింటెండెంట్ తదితరులు సభ్యులుగా ఉన్నారు.
సాధారణ రోగులకు వైద్య సేవలసంగతి ఎలా ఉన్నా మృతదేహాలను భద్రపరిచే మార్చురీలో ఫ్రిజ్‌లు అందుబాటులో లేకపోవడం అధికారుల పర్యవేక్షణ తీరును ప్రశ్నిస్తోంది. రోగులకు వైద్య సదుపాయాలు కల్పించడం ఎంత ముఖ్యమో.. మృతదేహానికి కనీస గౌరవం దక్కేలా ఏర్పాట్లు చేయడం కూడా అంతే అవసరం.
కానీ మార్చురీలో కనీస సదుపాయాల కొరత కొనసాగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కమిటీ సమావేశంలో ఆస్పత్రి అధికారులు పలు సమస్యలను సభ్యుల దృష్టికి తీసుకెళ్లారు. అవసరమైన సదుపాయాలపై వివరించారు. వాటిని పరిష్కరిస్తామని హామీలు ఇచ్చినా.. ఆచరణలో మాత్రం ముందడుగు కనిపించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.
కమిటీలు ఏర్పాటు చేయడం.. సమావేశాలు నిర్వహించడం.. సమస్యలు విని హామీలు ఇవ్వడం మాత్రమే అభివృద్ధి కాదు. తీసుకున్న నిర్ణయాలు అమలయ్యేలా చూడాలి. లేదంటే ప్రజలకు ఉపయోగపడాల్సిన కమిటీలు కాగితాలపైనే మిగిలిపోతాయన్న విమర్శలు తప్పవు.
