HomeTelanganaNizamabadముగిసిన నామినేషన్ల పర్వం.. అభ్యర్థుల్లో వీడని ఉత్కంఠ!

ముగిసిన నామినేషన్ల పర్వం.. అభ్యర్థుల్లో వీడని ఉత్కంఠ!

నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పోరు..చివరి రోజు పోటెత్తిన దరఖాస్తులు.. మొత్తం 1005 మంది నామినేషన్ లు..బీ-ఫామ్ ఎవరికో?నగర,పుర పాలక సంస్థ ఎన్నికల నామినేషన్ల పర్వం శుక్రవారంతో ముగిసింది.

ఆఖరి రోజు కావడంతో అభ్యర్థుల తాకిడితో నామినేషన్ కేంద్రాలు కిక్కిరిసిపోయాయి. ప్రతి డివిజన్ నుంచి ప్రధాన పార్టీల తరపున కుప్పలుతెప్పలుగా నామినేషన్లు దాఖలయ్యాయి. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో మొత్తం 60 డివిజన్ ఉన్నాయి.

అన్ని డివిజన్ల నుంచి మొత్తం 1005 నామినేషన్ పత్రాలు దాఖలు అయినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. బీజేపీ నుంచి253 నామినేషన్ లు,కాంగ్రెస్ నుంచి 319, బీఆర్ఎస్ నుంచి 120, స్వతంత్ర అభ్యర్థులు 118, ఎంఐఎం 89 మంది నామినేషన్ దాఖలు చేసినట్లు అధికారులు తెలిపారు.

ఆర్మూర్ మున్సిపాలిటీ నుంచి మొత్తం264దరఖాస్తులు వచ్చాయి.భీమ్ గల్ నుంచి 84, బోధన్ నుంచి342 నామినేషన్ లు దాఖలు అయినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. అయితే,ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు నామినేషన్ వేసిన ప్రతి ఒక్కరినీ ఇప్పుడు ‘బీ-ఫామ్’ టెన్షన్ పట్టుకుంది.

పార్టీ టికెట్ నాకే వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నా.. లోలోపల మాత్రం గుబులు మొదలైంది.అభ్యర్థుల ఎంపికలో ఈసారి ఎక్కడా రాజీ పడకూడదని పార్టీలు నిర్ణయించుకున్నాయి.

ఇప్పటికే ప్రతి డివిజన్ నుంచి ముగ్గురు పేర్లతో జాబితాను సిద్ధం చేశారు. కేవలం పాత పరిచయాలకో, సిఫార్సులకో కాకుండా.. ఆర్థికంగా ఎవరు బలంగా ఉన్నారు? ప్రజల్లో ఎవరికి ఆదరణ ఉంది? అనే అంశాలపై సర్వే రిపోర్టుల ఆధారంగానే ‘బీ-ఫామ్’ అందజేస్తామని పార్టీలు ఇప్పటికే కరాఖండిగా చెప్పేశాయి.

మేయర్ పీఠంపై ‘హస్తం’ గురి.. పట్టు కోసం ‘కమలం’ పోరు

పదేళ్ల తర్వాత అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. నగరాభివృద్ధి అజెండాతో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని ఆ పార్టీ పట్టుదలతో ఉంది.

మరోవైపు, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో బీజేపీకి బలమైన ఓటు బ్యాంకు ఉంది.గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో మేయర్ పీఠాన్ని కోల్పోయిన కమలం పార్టీ, ఈసారి ఆ పొరపాట్లకు తావు లేకుండా వ్యూహాలు కదుపుతున్నారు.

గెలుపు గుర్రాలను బరిలోకి దింపి, ఈసారి మేయర్ పీఠాన్ని కచ్చితంగా దక్కించుకుంటామని ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక ఫిబ్రవరి 3న నామినేషన్ల ఉపసంహరణకు సమయం ఉండటంతో, అంతవరకు అభ్యర్థుల మధ్య ఈ ఉత్కంఠ కొనసాగుతూనే ఉంటుంది.

అధిష్టానానికి ‘రెబెల్’ సెగ! నామినేషన్ల గడువు ముగిసినా, పార్టీల అసలు తలనొప్పి ఇప్పుడు మొదలైంది. టికెట్ ఆశించి భంగపడ్డ వారు ‘రెబెల్’గా బరిలో నిలిస్తే ఓట్లు చీలి ప్రత్యర్థికి లాభం చేకూరుతుందన్న భయం నేతల్లో నెలకొంది.

అందుకే ‘బీ-ఫామ్’ అందని వారిని బుజ్జగించేందుకు, అవసరమైతే భవిష్యత్తులో నామినేటెడ్ పదవుల ఆశ చూపేందుకు పార్టీలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి.ఆశావహులను బుజ్జగించేందుకు ఇప్పటికే కీలక నేతలు రంగంలోకి దిగారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments