Tuesday, January 20, 2026
HomeTelanganaNizamabadనగర అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి..

నగర అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి..

నిర్ణీత గడువులోగా ‘అమృత్’ పనులు పూర్తి కావాలి..

అధికారులతో సమీక్షలో అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ..

నగర అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని చేపట్టిన వివిధ ప్రాజెక్టులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన తన కార్యాలయంలో పబ్లిక్ హెల్త్, మున్సిపల్ ఇంజనీరింగ్ శాఖ అధికారులతో కలిసి కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా నగరంలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని ఆయన శాఖల వారీగా ఆరా తీశారు. కేంద్ర ప్రభుత్వ ‘అమృత్-2’ పథకం కింద నగరంలో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, మ్యాన్‌హోల్స్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే సూచించారు.

డ్రైనేజీ పనుల వల్ల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని, నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని స్పష్టం చేశారు. అదేవిధంగా వాటర్ వర్క్స్, వాటర్ ట్యాంకుల నిర్మాణాలను త్వరగా పూర్తి చేసి శివారు ప్రాంతాలకు సైతం సురక్షిత మంచి నీటిని అందించాలని ఆదేశించారు.

టీయూఎఫ్ఐడిసి నిధులు రూ. 60 కోట్లతో నగరంలోని ప్రతి డివిజన్‌కు కోటి రూపాయల చొప్పున కేటాయించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ నిధులతో చేపట్టే సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కల్వర్టుల నిర్మాణాలకు సంబంధించి టెండర్ ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలన్నారు.

నగరానికి తలమానికంగా ఉన్న రామర్తి చెరువు సుందరీకరణ పనులను వేగవంతం చేసి, ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించాలని అధికారులను కోరారు. పనుల నిర్వహణలో కాంట్రాక్టర్లు, అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఎమ్మెల్యే హెచ్చరించారు.

ప్రజా ధనాన్ని సద్వినియోగం చేస్తూ, చిత్తశుద్ధితో పనులు పూర్తి చేయాలని.. కాలయాపన చేస్తే సహించేది లేదని తేల్చి చెప్పారు.ఇందూరు నగర అభివృద్ధే నా లక్ష్యం.. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతానని ఆయన పేర్కొన్నారు.

ఈ సమీక్షా సమావేశంలో పబ్లిక్ హెల్త్ ఈఈ తిరుపతి, మున్సిపల్ ఇన్‌ఛార్జ్ ఈఈ నాగేష్ రెడ్డి, పబ్లిక్ హెల్త్ ఏఈ శంకర్ తదితర అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!