జగిత్యాల జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో పులి సంచరిస్తోందన్న సమాచారంతో అటవీ, పోలీస్ శాఖలు ఒక్కసారిగా అప్రమత్తమయ్యాయి. ఉమ్మడి జిల్లాల సరిహద్దుల్లో పులుల జాడను కనుగొనేందుకు, పర్యవేక్షణను తీవ్రం చేసేందుకు కమ్మర్‌పల్లి రేంజ్ పరిధిలోని కోనాపూర్ సెక్షన్ కేసీ తండా, వాసన్ గుట్ట తండాతో పాటు పరిసర అటవీ ప్రాంతాల్లో సోమవారం అటవీ సిబ్బంది, పోలీసులు సంయుక్తంగా మెరుపు దాడులు, విస్తృత తనిఖీలు చేపట్టారు.సంయుక్త బృందాలు అటవీ సరిహద్దులను, అనుమానాస్పద ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించాయి. పులి సంచారానికి సంబంధించి స్థానిక గ్రామస్తుల నుంచి వివరాలు సేకరించారు. అయితే, ప్రస్తుత తనిఖీల్లో పులుల సంచారాన్ని ధృవీకరించే ఎలాంటి తాజా అడుగుజాడలు గానీ, ఆనవాళ్లు గానీ లభించలేదని నిజామాబాద్ జిల్లా అటవీ అధికారి (డీఎఫ్‌ఓ) అధికారిక ప్రకటనలో స్పష్టం చేశారు. పులి వార్తల నేపథ్యంలో సరిహద్దు గ్రామాల్లో స్థానికులు ఆందోళన చెందకుండా అటవీ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. సమీప నివాస ప్రాంతాల్లో గ్రామస్తులకు వన్యప్రాణుల సంచార నియమావళి, తీసుకోవాల్సిన ముందుజాగ్రత్తలపై అవగాహన సదస్సులు నిర్వహించారు. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావద్దని, ధృవీకరించని తప్పుడు సమాచారాన్ని సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చేయవద్దని అధికారులు కోరారు. రాత్రి సమయాల్లో పొలాల వద్దకు గానీ, అటవీ అంచు ప్రాంతాలకు గానీ ప్రజలు ఒంటరిగా వెళ్లకూడదు. ఎక్కడైనా వన్యప్రాణుల సంచారం గుర్తిస్తే వెంటనే అటవీ అధికారుల దృష్టికి తీసుకురావాలి. ప్రజల భద్రతతో పాటు వన్యప్రాణుల రక్షణను దృష్టిలో ఉంచుకుని అటవీ, పోలీస్ శాఖలకు స్థానికులు పూర్తి స్థాయిలో సహకరించాలి. సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితిని తాము నిశితంగా పర్యవేక్షిస్తున్నామని, స్థానిక అధికారుల సమన్వయంతో క్షేత్రస్థాయిలో నిఘా, నిరంతర నిఘా కార్యకలాపాలు కొనసాగుతాయని అటవీ శాఖ వెల్లడించింది.
