మద్యం మత్తులో తలెత్తిన చిన్న వివాదం ఒకరి ప్రాణాన్ని బలితీసుకోగా, మరొకరిని చావుబతుకుల మధ్యకు నెట్టిన దారుణ సంఘటన నిజామాబాద్ నగరంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. నగరంలోని ఫూలాంగ్ చౌరస్తా సమీపంలో గల తెల్ల కళ్ళు బట్టి కాంపౌండ్ వెనుక ఇద్దరిపై బండరాయితో దాడి చేయడంతో ఒకరు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.
పోలీసులు తెలిపిన వివరాలప్రకారం.. నగరంలోని ఫూలాంగ్ ప్రాంతంలో నివాసముంటూ చెత్త కాగితాలు ఏరుకునే సయ్యద్ షాకీర్ (46), అతని స్నేహితుడు కమ్మరి శివ (30)లు ఆదివారం సాయంత్రం ఫూలాంగ్ చౌరస్తా అగర్వాల్ ఐ హాస్పిటల్ వెనుక ఉన్న తెల్ల కళ్ళు బట్టికి మద్యం సేవించడానికి వెళ్లారు.
అక్కడ మద్యం తాగుతున్న సమయంలో, అక్కడకు వచ్చిన మరో వ్యక్తితో వీరికి తీవ్రస్థాయిలో గొడవ జరిగింది.మాట మాట పెరగడంతో ఆగ్రహానికి లోనైన సదరు వ్యక్తులు.. షాకీర్, శివలను కళ్ళు బట్టి కాంపౌండ్ వాల్ అవతలికి లాక్కెళ్లారు. అనంతరం అక్కడే ఉన్న భారీ బండరాయితో ఇద్దరి తలలపై గట్టిగా బాదారు. ఈ దాడిలో తీవ్ర రక్తస్రావమై ఇద్దరూ రక్తం మడుగులో కొట్టుమిట్టాడారు.
గమనించిన కళ్ళు బట్టి ఓనర్ మారుతి గౌడ్ వెంటనే స్పందించి ‘108’ అంబులెన్స్‌కు సమాచారం అందించారు. రాత్రి 8:30 గంటల ప్రాంతంలో వారిని నిజామాబాద్ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే సయ్యద్ షాకీర్ చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు.
తీవ్రంగా గాయపడిన కమ్మరి శివ ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు.కాలనీవాసుల ద్వారా సమాచారం అందుకున్న మృతుడి తమ్ముడు సయ్యద్ జాకీర్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని, అనంతరం నిజామాబాద్ నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన నాలుగో పట్టణ స్టేషన్ హౌస్ ఆఫీసర్ సతీష్ దర్యాప్తు వేగవంతం చేశారు.
