రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన నాలుగు సంఘాల్లో ఒకటైన జాతీయ జర్నలిస్ట్ యూనియన్ అనుబంధ తెలంగాణ జర్నలిస్ట్ ఫోరమ్ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జిల్లా కేంద్రంలో గురువారం ఘనంగా నిర్వహించారు.
టీజేఏ జిల్లా అధ్యక్షుడు, జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యుడు జి. సాయి ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా జిల్లా కేంద్రంలోని మానసిక వికలాంగుల (స్నేహ సొసైటీ ఫర్ రూరల్ కన్స్ట్రుక్షన్) ప్రత్యేక పాఠశాలలో విద్యార్థులకు బిస్కెట్లు తదితర వస్తువులను అందజేశారు.
ఈ సందర్భంగా సాయి ప్రసాద్ మాట్లాడుతూ.. టీజేఏ ఫౌండర్ ఉప్పల లక్ష్మణ్, రాష్ట్ర అధ్యక్షుడు కేవీ రమణారావు, ప్రధాన కార్యదర్శి గోరి నేతృత్వంలో జర్నలిస్టుల హక్కుల సాధన కోసం నిరంతరం పోరాటాలు సాగుతున్నాయని తెలిపారు.
కేవలం వృత్తిపరమైన హక్కులకే పరిమితం కాకుండా ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ వేడుకలపై స్నేహ సొసైటీ ఫర్ రూరల్ కన్స్ట్రుక్షన్ కార్యదర్శి సిద్దయ్య మాట్లాడుతూ.. టీజేఏ ఆవిర్భావాన్ని కేవలం వేడుకలకే పరిమితం చేయకుండా ఆసుపత్రులలో రోగులకు పండ్లు పంపిణీ చేయడం, విద్యార్థులకు నోట్బుక్స్ అందజేయడం వంటి సేవా కార్యక్రమాలతో నిర్వహించడం అభినందనీయమన్నారు.
జర్నలిస్టుల వృత్తిగత భద్రత, ఆత్మగౌరవం, సంక్షేమం కోసం టీజేఏ అసోసియేషన్ చేస్తున్న కృషి ఎంతో స్పూర్తిదాయకమని, వారి పోరాటాలు మరింత సఫలీకృతం కావాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో టీజేఏ ప్రతినిధులు కొట్టూరి ప్రమోద్, తమ్మాలి పాండు, ఆర్. శ్రీనివాస్ రెడ్డి, పి. యశస్వి, పి. మురళీ కృష్ణ, వికాస్ గైక్వాడ్, పులగం శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
