ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కానిస్టేబుల్ భార్యకు అత్యవసరంగా రక్తం అవసరం కాగా, ఆయనే స్వయంగా ముందుకొచ్చి రక్తదానం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ట్రాఫిక్ విభాగంలో పనిచేస్తున్న కానిస్టేబుల్ దేవీలాల్ రాథోడ్ భార్య గత రెండు రోజులుగా అనారోగ్యంతో నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఆదివారం ఉదయం ఆమె ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించడంతో, అత్యవసరంగా రక్తం కావాలని వైద్యులు సూచించారు. ఈ విషయం తెలుసుకున్న సీఐ ప్రసాద్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆసుపత్రికి చేరుకొని రక్తదానం చేశారు.
ఈ సందర్భంగా సీఐ ప్రసాద్ మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న వారికి రక్తదానం చేయడం ద్వారా ఒక ప్రాణాన్ని కాపాడిన వారమవుతామని పేర్కొన్నారు. ఆపత్కాలంలో తోటి వారికి సాయం చేయడంలో లభించే తృప్తి వేరని, ప్రతి ఒక్కరూ రక్తదానంపై అవగాహన పెంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
సమయానికి స్పందించి ప్రాణదాతగా నిలిచిన సీఐని ఉన్నతాధికారులు, తోటి సిబ్బంది, వైద్యులు అభినందించారు.
