నిజామాబాద్ పసుపు మార్కెట్ యార్డులో వివిధ సంఘాల కార్మికులు చేపట్టిన మెరుపు సమ్మె ఉద్రిక్తంగా మారింది. తమను దొంగలుగా ముద్ర వేయడం ఫై వారంతా రగిలి పోయారు. ఈ వ్యవహారంలో అతి చేస్తున్న సెక్యూరిటీ అధికారి నిర్బందించారు. పోలీస్ వాహనం మీది నుంచి కిందికి దించి కొట్టారు. దీనితో మార్కెట్ యార్డులో ర్యాలీ నిర్వహించిన అనంతరం మార్కెట్ కమిటీ చైర్మన్ కార్యాలయాన్ని ముట్టడించారు.
అయితే, కొద్ది రోజులుగా యార్డు నుండి పసుపు దొంగతనం అవుతోంది. ఇక్కడి కార్మికులు కొందరు పసుపు సంచులు ఎత్తుకు పోయి బయట అమ్ముకుంటున్నారని అధికారులు ఆరోపిస్తున్నారు.
ఈ మేరకు కొందరు కార్మికులను పిలిపించి ప్రశ్నించారు. దీంతో తమ పై పసుపు దొంగతనం ఆరోపణలు చేస్తున్నారని, అభాండాలు వేసి వేధిస్తున్నారని అన్ని సంఘాల కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అందరూ పని మానేసి ఆందోళన చేయడంతో పసుపు తూకాలు నిలిచి పోయాయి. క్రయ విక్రయాలు నిలిచిపోవడంతో రైతులు కూడా ఆందోళన చేపట్టారు. ఈ గందరగోళం జరుగుతుండగా మార్కెట్ యార్డు సెక్యూరిటీ అధికారి శ్రీనివాస్ ను కార్మికులు నిర్బంధించారు.
అప్పటికే చేరుకున్న పోలీసులు శ్రీనివాస్ ను తమ వాహనంలో ఎక్కించుకుని తీసుకు వెళ్తుండగా కార్మికులు మూకుమ్మడిగా దాడి చేశారు. పోలీసు వాహనంలో కూర్చున్న శ్రీనివాస్ పై దాడి చేసి కొట్టారు.
పోలీస్ వాహనాన్ని అడ్డుకుని మరీ దాడికి పాల్పడడంతో ఉద్రిక్తత ఏర్పడింది. అనంతరం పోలీసులు కార్మికులను అదువుచేసి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
