ఇందూరు: అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు గర్భిణీలకు క్రమం తప్పకుండా పౌష్టికాహారం అందజేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు.
మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నగరంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… అంగన్వాడీ కేంద్రాల్లో అందజేసే పౌష్టికాహారంలో ఎటువంటి అక్రమాలు చోటు చేసుకోకుండా కేంద్ర ప్రభుత్వం నూతన యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు. యాప్ లో పూర్తి వివరాలు నమోదు చేయడం జరుగుతుందని చెప్పారు.
అంగన్వాడీ టీచర్ల సౌకర్యార్థం ప్రభుత్వం స్మార్ట్ ఫోన్ లను అందజేయడం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు అంగన్వాడీ కేంద్రాల్లో అందజేసే పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకొని ఆరోగ్యంగా ఉండాలన్నారు.
గర్భిణీలు అంగన్వాడి కేంద్రాల్లో తమ వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిని పద్మ, సిడిపిఓ సౌందర్య, బిజెపి కార్పొరేటర్లు జ్యోతి మురళి, బంటు ప్రీతి ప్రవీణ్, ఇల్లెందుల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
