“ఏకాదశి వ్రతం కోటి యజ్ఞాల ఫలానికి సమానం” అని పురాణాలు పేర్కొంటాయి. శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన ఈ పవిత్ర తిథి సందర్భంగా నిజామాబాద్ నగరం శనివారం భక్తి పారవశ్యంలో మునిగిపోయింది. వేకువజామునే గోవింద నామస్మరణతో ఆలయాలు మార్మోగగా, వేలాది మంది భక్తులు శ్రీహరి దర్శనం కోసం తరలివచ్చారు.
వేదఘోషలు, మంగళ వాయిద్యాలు, హరినామ సంకీర్తనలతో ఆలయ ప్రాంగణాలు ఆధ్యాత్మిక కాంతిని సంతరించుకున్నాయి. నగరంలోని జెండా బాలాజీ ఆలయం, గంగస్థాన్ ఉత్తర తిరుపతి శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం, చక్రేశ్వరాలయం,
విఠలేశ్వరాలయం, రామచంద్రపల్లి అపురూప శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం తదితర క్షేత్రాల్లో ఉదయం నాలుగు గంటల నుంచే సుప్రభాత సేవ, పవిత్ర అభిషేకాలు, తోమాల సేవ, అర్చనలు, విష్ణు సహస్రనామ పారాయణం, ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా గంగస్థాన్‌లోని ఉత్తర తిరుపతి క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వరస్వామికి లక్ష తులసి దళాలతో నిర్వహించిన విశేష అర్చన ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
శ్రీహరికి అత్యంత ప్రీతికరమైన తులసి దళాలతో అర్చన చేయడం వల్ల సకల పాపాలు నశించి, ఐశ్వర్యం, ఆరోగ్యం, శాంతి, మోక్షప్రాప్తి కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ విశిష్ట సేవను దర్శించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
ఏకాదశి… ఉపవాసం మాత్రమే కాదు, ఉపాసన కూడా
ఏకాదశి అంటే కేవలం ఆహారం మానేయడం కాదు… మనస్సును భగవంతునిపై కేంద్రీకరించడం. దశమి రోజున ఒకపూట భోజనం చేసి, ఏకాదశి రోజంతా నిరాహార దీక్షతో హరినామ స్మరణ, విష్ణు సహస్రనామ పారాయణం, భగవద్గీత పఠనం, జాగరణ చేయడం ఈ వ్రతం విశిష్టత. ద్వాదశి రోజున పారణ చేయడం ద్వారా వ్రతం సంపూర్ణమవుతుందని పురాణాలు పేర్కొంటున్నాయి.
హరి నామస్మరణతో మార్మోగిన ఆలయాలు
“ఓం నమో నారాయణాయ”, “గోవిందా… గోవిందా…”, “శ్రీనివాస… శ్రీనివాస…” అనే నామస్మరణలతో ఆలయాలు మార్మోగాయి. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు కుటుంబ సమేతంగా ఆలయాలకు చేరుకుని స్వామివారి దర్శనం చేసుకున్నారు.
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీలు ప్రత్యేక క్యూలైన్లు, తీర్థప్రసాదాల పంపిణీ, సేవా కార్యక్రమాలను ఏర్పాటు చేశాయి. శ్రీమహావిష్ణువు అనుగ్రహం పొందేందుకు, పాప విముక్తి కోసం, ఆత్మశాంతి కోసం ఆచరించే ఏకాదశి వ్రతం… నిజామాబాద్ నగరాన్ని శనివారం భక్తి, భగవద్భావం, ఆధ్యాత్మికతతో నింపేసింది.
