ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోకుండా వీడీసీ సభ్యులు అడ్డుకోవడమే కాకుండా, పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఒక నిరుపేద మహిళ ఆవేదన వ్యక్తంచేశారు.
ఈ మేరకు సోమవారం జరిగిన ప్రజావాణిలో డొంకేశ్వర్ గ్రామానికి చెందిన మల్లవ్వ తన గోడును వెల్లబోసుకున్నారు.అనంతరం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. డొంకేశ్వర్ గ్రామం, ఇంటి నంబరు 2-49/5లో మల్లవ్వ తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నారు.
ఆమె భర్త స్వర్గీయ ఇమ్మానియేల్ మరణానంతరం, పేదరికాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వారికి అదే స్థలంలో ‘ఇందిరమ్మ ఇల్లు’ మంజూరు చేసింది. ఇంటి పన్నులు సైతం క్రమం తప్పకుండా చెల్లిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. అయితే, ఇల్లు నిర్మించుకోవడానికి సిద్ధమైన మల్లవ్వను స్థానిక వీడీసీ సభ్యులు అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు.
తమ గ్రామంలో ఇల్లు కట్టుకోవాలంటే డబ్బులు చెల్లించాలని, లేనిపక్షంలో ఇల్లు కట్టనివ్వబోమని వీడీసీ వ్యక్తులు బెదిరిస్తున్నారని ఆరోపించారు. వీడీసీ పేరుతో వారు చేస్తున్న అరాచకాల వల్ల ఒంటరి మహిళనైన తాను, తన కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నామని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వమే అధికారికంగా ఇల్లు మంజూరు చేసినా, స్థానిక కమిటీ పేరుతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, తమకు రక్షణ కల్పించి ఇల్లు నిర్మించుకునేలా చూడాలని ఆమె సిపికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
