HomeTelanganaNizamabadప్రభుత్వ వైఫల్యాలపై ఉద్యమించాలి నియోజకవర్గాల్లో ప్రతి నెలా ప్రజాపోరాటాలు చేపట్టండి కష్టపడి పనిచేసేవారికే ప్రజాదరణ, భవిష్యత్తు...

ప్రభుత్వ వైఫల్యాలపై ఉద్యమించాలి నియోజకవర్గాల్లో ప్రతి నెలా ప్రజాపోరాటాలు చేపట్టండి కష్టపడి పనిచేసేవారికే ప్రజాదరణ, భవిష్యత్తు బీజేపీ జిల్లా కోర్ కమిటీ సమావేశంలో ఎంపీ అర్వింద్ దిశానిర్దేశం

ప్రజల సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తూ, నిరంతరం ఉద్యమించాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆదివారం నిజామాబాద్ నగరంలోని భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో బీజేపీ జిల్లా కోర్ కమిటీ సమావేశం జరిగింది.

జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎంపీ అర్వింద్‌తో పాటు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లాలో పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు. అయితే, జిల్లాలో పార్టీ కార్యకలాపాలు ఆశించిన స్థాయిలో సాగడం లేదని, కొన్ని నియోజకవర్గాల్లో స్తబ్దత నెలకొనడంపై ఎంపీ ఒకింత అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.

ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ ప్రతి నెలా స్థానిక సమస్యలపై పెద్ద ఎత్తున ఉద్యమాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఎంపీ అర్వింద్ స్పష్టం చేశారు. “ఎమ్మెల్యేలు ఉన్నా, లేకున్నా స్థానిక నియోజకవర్గ నాయకులే బాధ్యత తీసుకుని ముందుకు సాగాలి. ఫలానా వారే కార్యక్రమాలు చేయాలనే నిబంధన ఏమీ లేదు.

ఎవరు ప్రజా సమస్యలపై గట్టిగా పోరాడి, నిరంతరం ప్రజల్లో ఉంటారో వారికే ప్రజాదరణ పెరుగుతుంది. రాబోయే ఎన్నికల్లో వారే అభ్యర్థులుగా ఎదిగే అవకాశం ఉంటుంది” అని ఆయన వ్యాఖ్యానించినట్లు సమాచారం.

ఇటీవల జగిత్యాలలో కేంద్రీయ విద్యాలయ స్థల వివాదంపై అక్కడి నాయకులు గట్టిగా పోరాడారని, అలాగే కోరుట్ల నియోజకవర్గంలోనూ ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు, స్థానిక సమస్యలపై పార్టీ శ్రేణులు చురుగ్గా కదిలాయని ఎంపీ గుర్తు చేసినట్లు తెలిసింది.

ఆయా నియోజకవర్గాల పోరాట పటిమను మిగిలిన నాయకులు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నిజామాబాద్ అర్బన్, కొంతవరకు రూరల్ నియోజకవర్గాల్లో పార్టీ హడావుడి కనిపించిందని, కానీ మిగతా నియోజకవర్గాల్లో ప్రభుత్వ వైఫల్యాలపై ఆశించిన స్థాయిలో నిరసనలు జరగడం లేదని అభిప్రాయపడ్డారు.

ఇకపై జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సమరశంఖం పూరించాలని కోర్ కమిటీ నేతలకు ఎంపీ పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో జిల్లాకు చెందిన పలువురు రాష్ట్ర, జిల్లా స్థాయి ముఖ్య నాయకులు, కోర్ కమిటీ సభ్యులు పాల్గొని జిల్లాలో పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన పలు అంశాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments