రానున్న నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ ఘనవిజయం సాధించి, బల్దియాపై గులాబీ జెండాను ఎగరవేయడమే లక్ష్యంగా పనిచేయాలని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి రాజ్యసభ సభ్యులు సురేష్ రెడ్డి, మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ వి.జి గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లండిఈ సందర్భంగా గణేష్ బిగాల మాట్లాడుతూ..
తెలంగాణ ఉద్యమ పార్టీగా ప్రస్థానం మొదలుపెట్టిన బిఆర్ఎస్, ఎన్నో ఎన్నికల పోరాటాలను చవిచూసిందని గుర్తు చేశారు. గత పదేళ్ల కాలంలో కెసిఆర్ గారి నాయకత్వంలో నిజామాబాద్ నగర రూపురేఖలు మార్చామని, ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడిగే నైతిక హక్కు కేవలం తమ పార్టీకే ఉందని స్పష్టం చేశారు.
“కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా, నగరంలోని ఏ ఒక్క డివిజన్‌లోనూ కొత్త పనులకు నిధులు మంజూరు చేయలేదు. ఈ విషయాన్ని ప్రజల్లో ఎండగట్టాలి” అని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.నగర ప్రగతిపై ప్రస్థావనగత దశాబ్ద కాలంలో నగరంలో జరిగిన అభివృద్ధిని ఆయన ఈ సందర్భంగా వివరించారు:
మౌలిక సదుపాయాలు: ప్రతి డివిజన్‌లో కనీసం ఒక పార్కు ఉండేలా చర్యలు తీసుకోవడంతో పాటు బొడ్డెమ్మ చెరువును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాం.
డ్రైనేజీ వ్యవస్థ: దశాబ్దాల కాలంగా పేరుకుపోయిన నాలాలను పూడికతీత తీయించి, వర్షపు నీరు సాఫీగా వెళ్లేలా ‘స్టార్మ్ వాటర్ డ్రైనేజీ’లను నిర్మించాం.
సామాజిక భవనాలు: రాజకీయాలకు అతీతంగా అన్ని కులాల కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి నిధులు కేటాయించాం.
ఆపత్కాలంలో అండగా: కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు అండగా ఉండి సేవ చేశామని, మున్సిపల్ కార్మికులను, ఆశా వర్కర్లను, మహిళా సంఘాలను ఎల్లప్పుడూ గౌరవించుకున్నామని తెలిపారు.ప్రజల్లో చర్చ జరగాలి”బిఆర్ఎస్ పదేళ్ల ప్రగతి పాలన వర్సెస్ కాంగ్రెస్ రెండేళ్ల నిమ్మకు నీరెత్తిన పాలన”పై ప్రతి ఇంటిలో చర్చ జరగాలని ఆయన కోరారు. రానున్న ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి విజయం సాధించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ దండు నీతు కిరణ్ శేఖర్, నగర అధ్యక్షుడు సిర్ప రాజు, సీనియర్ నాయకులు సత్యప్రకాష్, సుజిత్ సింగ్, నవీద్ ఇక్బాల్, ఇమ్రాన్ షెహజాద్, అబ్దుల్ మతీన్ తదితరులు పాల్గొన్నారు.
