నగరంలో వరుస నేరాలకు పాల్పడుతూ, ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న రౌడీషీటర్ బర్సాత్ అమేర్‌పై పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఉక్కుపాదం మోపారు. శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా అతడిని ఏడాది పాటు జిల్లా నుంచి బహిష్కరిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆటోనగర్ ప్రాంతానికి చెందిన అమేర్ అలీ ఖాన్ అలియాస్ బర్సాత్ అమేర్ (27) గత ఆరేళ్లుగా నగరంలో వరుస అరాచకాలకు పాల్పడుతున్నాడు.
ఇతనిపై జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో హత్యాయత్నం, దౌర్జన్యాలు సహా మొత్తం 22 కేసులు నమోదయ్యాయి. గతంలోనే ఇతనిపై పీడీ యాక్ట్ ప్రయోగించినప్పటికీ, జైలు నుంచి రాగానే మళ్లీ పాత పద్ధతిలోనే నేర ప్రవృత్తిని కొనసాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఎన్నికల దృష్ట్యా జిల్లాలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీపీ తెలిపారు. హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్-1348 ఫస్లీలోని సెక్షన్ 26(1)(ఎ) ప్రకారం అమేర్‌ను ఒక సంవత్సరం పాటు జిల్లా పొలిమేరల అవతలకు పంపిస్తున్నట్లు పేర్కొన్నారు.
