నగర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, అవినీతికి తావులేకుండా ‘ఇందూరు’ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ స్పష్టం చేశారు. నగరంలోని 50వ డివిజన్ శివాజీ నగర్‌లో ఆదివారం నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డివిజన్ బీజేపీ అభ్యర్థి జగదీష్ కులకర్ణికి మద్దతుగా ఆయన ప్రసంగించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలలో ఒక్కటి కూడా సక్రమంగా అమలు కాలేదని ఎమ్మెల్యే ధన్ పాల్ విమర్శించారు. హామీలను నిలబెట్టుకోవడంలో విఫలమైన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజల వద్దకు వచ్చే నైతిక హక్కు లేదన్నారు.
“చేతగాని, అసమర్థ పాలనతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తోంది. హిందూ దేవతలను అవమానించే శక్తులకు ఈ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెబుతారు” అని ఆయన హెచ్చరించారు.చీకటి ఒప్పందాలపై ధ్వజంకాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఒక వర్గం ఓట్ల కోసం భయపడి ‘ఇందూరు’ అనే పేరును కూడా పలకలేకపోతున్నాయని ఎద్దేవా చేశారు.
ఎంఐఎం, కాంగ్రెస్ మధ్య చీకటి ఒప్పందం కుదిరిందని ఆరోపించిన ఆయన, ‘మన ఇందూరు – మన మేయర్’ అనే నినాదం వింటేనే ప్రతిపక్షాలకు వణుకు పుడుతోందని అన్నారు. గత పదేళ్లలో మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా కేవలం కమీషన్లు, కాంట్రాక్టర్లకే ప్రాధాన్యత ఇచ్చారని ధన్ పాల్ దుయ్యబట్టారు. ఒక్క నిరుపేద కుటుంబానికైనా డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు అందించారా అని ప్రశ్నించారు.
రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను బీజేపీ సవాల్‌గా తీసుకుందని, మెజార్టీ స్థానాల్లో కాషాయ జెండా ఎగురవేసి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు కిట్టు పాటిల్, బాలకృష్ణ, దీపక్, అల్లాడి రాజుతో పాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
