గత ఏడాది ఫిబ్రవరి 1న సర్పంచుల పదవీకాలం ముగియడంతో అప్పటినుండి ఇప్పటివరకు సుమారు 16 నెలల కాలం పంచాయతీలు ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్నాయి.
దీంతో గ్రామాల్లో అభివృద్ధి ప్రశ్నార్థకంగా మారింది. అయితే పంచాయతీ పాలకవర్గాల గడువు ముగిశాక, ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. వార్డులు, సర్పంచ్ స్థానాలు రిజర్వేషన్ల మార్పుతో అది సాధ్యం కాలేదు.
2019 ఎన్నికల సందర్భంగా అప్పటి కెసిఆర్ సర్కార్ గ్రామపంచాయతీ చట్టం – 2018 తీసుకువచ్చింది. ఆ చట్టంలో కొన్ని నిబంధనల ప్రకారం పది సంవత్సరాలపాటు రిజర్వేషన్లు కొనసాగాలి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించడంతో రిజర్వేషన్లు మార్చాల్సిన పరిస్థితి ఎదురయింది.
ఇదిలా ఉండగా మరోవైపు బీసీ కమిషన్ జనాభా రేషియో ప్రకారం రిజర్వేషన్ల ఖరారుపై కసరత్తు చేస్తుంది. దీంతో చట్టసభలో బిల్లు ఆమోదం పొందడంతో రిజర్వేషన్లు మార్పు తప్పనిసరి అయింది.
ఈ ప్రక్రియలో కొంత ఆలస్యం కారణంగా స్థానిక సంస్థలు వాయిదా వేస్తూ వచ్చారు. కానీ ఇటీవల రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు సెప్టెంబర్ 30లోగా స్థానిక సమరాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించడంతో రిజర్వేషన్ ఎలా ఉంటుందో అనే ఆందోళన ఆశావాహులను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.
మూడు నెలల లోపు స్థానిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గ్రామాల్లో రాజకీయం వేడెక్కుతుంది. రిజర్వేషన్లు ఇంకా ఖరారు కాకపోవడంతో తమ అనుచరులను కాపాడుకోవడంలో ఆశవాహులు నాన తంటలు పడుతున్నారు.
ఏ సామాజిక వర్గానికి రిజర్వేషన్ వస్తుందో తెలియకపోవడంతో.. అన్ని సామాజిక వర్గాలకు చెందిన గ్రామస్థాయి నేతలు అష్ట కష్టాలు పడుతున్నారు. దీంతో రిజర్వేషన్ చిక్కు ఎప్పుడు ముడివీడుతుందో అని ఎదురుచూస్తున్నారు
