Monday, May 4, 2026
HomeTelanganaNizamabadఇందిరమ్మ చీరల పంపిణీతో మహిళల ఆత్మగౌరవం ఇనుమడింపు...ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి..అట్టహాసంగా ఇందిరమ్మ చీరల పంపిణీకి...

ఇందిరమ్మ చీరల పంపిణీతో మహిళల ఆత్మగౌరవం ఇనుమడింపు…ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి..అట్టహాసంగా ఇందిరమ్మ చీరల పంపిణీకి శ్రీకారం….పాల్గొన్న ఎమ్మెల్యేలు, కలెక్టర్, ప్రజాప్రతినిధులు…

మహిళల ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేసేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తోందని రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి అన్నారు.

గ్రామీణ ప్రాంత మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని శనివారం నిజామాబాద్ కలెక్టరేట్ లో అట్టహాసంగా ప్రారంభించారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్.భూపతిరెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి తదితరులు ఈ వేడుకలో భాగస్వాములు కాగా, ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన గావించారు.

ముఖ్య అతిథుల చేతుల మీదుగా మహిళలకు లాంచనంగా ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. ఎంతో ఆకర్షణీయంగా, నాణ్యతతో కూడిన చీరలను పంపిణీ చేయడం పట్ల మహిళలు, మహిళా సమాఖ్య ప్రతినిధులు హర్షం వెలిబుచ్చారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, మహిళల అభ్యున్నతికి తమ ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని గుర్తు చేశారు.

ప్రభుత్వ తోడ్పాటును సద్వినియోగం చేసుకుంటూ ఆర్ధిక, సామాజిక ప్రగతిని చాటాలని పిలుపునిచ్చారు. మహిళల ఆత్మగౌరవాన్ని పెంపొందించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఈసారి నాణ్యమైన చీరలను తయారు చేయించిందని అన్నారు.

గత ప్రభుత్వ హయాంలో నాసిరకం చీరలను అందించారని ఆక్షేపించారు. ఎలాంటి విమర్శలకు ఆస్కారం లేకుండా, తప్పిదాలు, లోటుపాట్లకు తావులేకుండా అర్హులైన ప్రతి మహిళకు ఇందిరమ్మ చీరలు పంపిణీ అయ్యేలా పారదర్శకంగా, ప్రణాళికాబద్దంగా కృషి చేయాలని అధికారులకు సూచించారు.

ఇప్పటికే ప్రభుత్వం అన్ని జిల్లాలకు సరిపడా చీరలను పంపించిందని, అవసరమైన పక్షంలో జిల్లాకు మరిన్ని చీరలు కేటాయించేలా చర్యలు తీసుకుంటామని, అర్హులైన ఏ ఒక్కరు మినహాయించబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.

కుటుంబ అభ్యున్నతిలో మహిళలే కీలకమని, భవిష్యత్ తరాల బాగు కోసం పిల్లలను చక్కగా చదివించాలని హితవు పలికారు. మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల వైపు పిల్లలు పెడదారి పట్టకుండా కాపాడుకోవాలని, నిపుణులైన ఉపాధ్యాయులు, మెరుగుపడిన సదుపాయాలతో కూడిన ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చదివించాలని హితవు పలికారు.

మంచి ఆహారపు అలవాట్లతో ఆరోగ్యాలను పరిరక్షించుకోవాలని, రసాయనిక మందులు వినియోగించకుండా సేంద్రీయ పద్ధతిలో పందిరి కూరగాయల సాగు వంటివి చేపట్టేందుకు ముందుకు వచ్చే మహిళా సఘాలు, సమాఖ్యలకు ప్రభుత్వపరంగా మరింత ప్రోత్సాహం అందిస్తామని అన్నారు.

కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ, మహిళా ఉన్నతి – తెలంగాణ ప్రగతి పేరిట 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు ఇందిరమ్మ చీరలు అందించాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో చీరల పంపిణీకి అవసరమైన చర్యలు తీసుకున్నామని తెలిపారు.

ప్రస్తుతం గ్రామీణ ప్రాంత మహిళలకు తొలి విడతలో చీరలను పంపిణీ చేస్తున్నారని, పట్టణ ప్రాంతాలలో మార్చి 1వ తేదీ నుండి వారం రోజుల పాటు చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని అన్నారు.

ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాట్లాడుతూ, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు తదితర వాటిని ప్రభుత్వం మహిళల పేరుతోనే మంజూరు చేస్తోందని, మహిళల అభ్యున్నతికి పెద్దపీట వేస్తోందని అన్నారు. వడ్డీ లేని రుణాలను అందించడమే కాకుండా, ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రాయితీపై రూ.500 లకే వంట గ్యాస్ సిలిండర్ అందిస్తోందన్న్నారు.

మహిళా సంఘాల ఆర్ధిక అభివృద్ధి కోసం ఇతోధికంగా తోడ్పాటును అందిస్తోందని గుర్తు చేశారు. ప్రభుత్వ తోడ్పాటుతో మహిళలు సమిష్టిగా ఉంటూ తమ వ్యాపార కార్యకలాపాలను మరింతగా విస్తరించాలని, తద్వారా కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే ప్రభుత్వ సంకల్పాన్ని ఆచరణలో నిరూపితం చేయాలని పిలుపునిచారు.

ఇదిలాఉండగా, ప్రభుత్వం మహిళలకు అందిస్తున్న ఇందిరమ్మ చీరలు ఎంతో నాణ్యతతో కూడుకుని ఉన్నాయని అన్నారు. అర్హులైన వారందరికీ చీరలు పంపిణీ జరిగేలా పక్కాగా పర్యవేక్షణ చేయాలని ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ, పైడి రాకేశ్ రెడ్డిలు సూచించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి, రాష్ట్ర సహకార సంఘాల యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, నుడా చైర్మన్ కేశ వేణు, నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, డీ.ఆర్.డీ.ఓ సాయాగౌడ్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్రకుమార్, మహిళా సమాఖ్య ప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు,

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!