రైతులను ఇబ్బంది పెడుతున్న యూరియా యాప్ ను పూర్తిగా రద్దు చేయాలనీ, రైతులకు ఎకరానికి నాలుగు సంచుల యూరియాను ఎలాంటి ఆంక్షలు లేకుండా ఒకేసారి పంపిణీ చేయాలని మరియు సొసైటీలో షాపుల్లో సరిపడా యూరియా విరివిగా ఉంచాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో వేల్పూర్ X రోడ్ లో జాతీయ రహదారి మీద భారీ ధర్నా, రస్తారోకో కార్యక్రమం నిర్వహించారు.
ఈ నిరసన కార్యక్రమంలో బాల్కొండ శాసనసభ్యులు, మాజీ మంత్రి శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని రైతులతో కలిసి రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.”ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం” ఎన్నటికీ ముందడుగు వేయలేదని, రైతులు లేకపోతే రాజ్యమే లేదని మన పెద్దలు చెప్పిన మాటలను ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.
ప్రస్తుత ప్రభుత్వంలో రైతులు ప్రతి చిన్న అవసరానికి, హక్కుల కోసం రోడ్లెక్కి కొట్లాడాల్సి వస్తోందని, అలాంటి దారుణమైన పరిస్థితి నేడు రాష్ట్రంలో దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రిగా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖర రావు (కేసీఆర్) రైతులను కంటికి రెప్పలా, గుండెల్లో పెట్టుకుని కాపాడుకున్నారని వేముల ప్రశాంత్ రెడ్డి కొనియాడారు..
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం యూరియా పంపిణీలో డిజిటల్ యాప్‌ల పేరుతో కొత్త నిబంధనలు తీసుకువచ్చి రైతులకు తీవ్ర ఇబ్బందులు సృష్టిస్తోందని ఎమ్మెల్యే ఆరోపించారు.కొత్తగా ప్రవేశపెట్టిన యాప్ విధానం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, దీనిని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.అవసరమైన యూరియాను ఎకరానికి 4 సంచుల చొప్పున ఒకేసారి సకాలంలో అందించాలని డిమాండ్ చేశారు. .
అంక్సాపూర్ గ్రామంలో ప్రారంభమైన ఈ నిరసన జ్వాలలు మోర్తాడ్, తిమ్మాపూర్, ధర్మోరా, వేల్పూర్,డొంకల్, మెండోరా, కమ్మర్‌పల్లి, బడా భీమ్‌గల్ వంటి అనేక గ్రామాలకు విస్తరించాయని, బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలోనూ, రైతులు స్వతంత్రంగానూ రాస్తారోకోలు చేస్తూ తమ నిరసనను తెలియజేస్తున్నారని వివరించారు.
జిల్లా కలెక్టర్ మరియు వ్యవసాయ శాఖాధికారులు ఎరువుల నిల్వలు పుష్కలంగా ఉన్నాయని చేస్తున్న ప్రకటనలలో ఎలాంటి వాస్తవం లేదని వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. అధికారులు చెప్తున్న లెక్కల ప్రకారమే జిల్లాలో మొత్తం 3 లక్షల మంది రైతులు ఉండగా, ఇప్పటివరకు కేవలం 1.5 లక్షల మందికి మాత్రమే 4 లక్షల యూరియా సంచులను పంపిణీ చేశారని, అంటే ఒక్కో రైతుకు రెండు సంచులు కూడా సరిగా అందలేదని ఎద్దేవా చేశారు. మిగిలిన 1.5 లక్షల మంది రైతులకు ఇప్పటివరకు ఒక్క సంచి కూడా అందలేదని ఆరోపించారు.
జిల్లాలో దాదాపు 6 లక్షల ఎకరాల సాగు భూమి ఉందని, ఎకరానికి కనీసం 4 సంచుల చొప్పున లెక్కించినా ఒకే పంట కాలానికి 24 లక్షల సంచుల యూరియా అవసరమవుతుందని గుర్తుచేశారు. ఇప్పటివరకు 4 లక్షల సంచులు మాత్రమే ఇచ్చి, ఇంకా 20 లక్షల సంచుల కొరత ఉండగా స్టాక్ ఫుల్ ఉందని ప్రకటించడం అధికారుల బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని మండిపడ్డారు.
